ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కన్పించకుండా పోయారు. బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో శుక్రవారం(జనవరి-3,2020) టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమనిపై ట్రంప్ ఆదేశాలతో అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి కిమ్ భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు సమాచారం. అమెరికాతో వేభేదం కొనసాగిస్తున్న తనను కూడా సోలేమని లాగా అమెరికా హతం చేస్తుందన్న భయంతో కిమ్ కన్పించకుండా పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఉత్తర కొరియా మీడియా తెలిపిన వివరాల ప్రకారం…అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ సెషన్ ముగిసిన డిసెంబర్-31,2019నుంచి కిమ్ పబ్లిక్ లో కన్పించడం లేదు. డిసెంబర్-31 మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్ పై కిమ్ విరుచుకుపడినట్లు సమాచారం. కిమ్ రాజవంశం వ్యవస్థాపకుడు కిమ్ ఇల్-సుంగ్ సమాధిని కిమ్ గత వారం సందర్శించాడని ప్యోంగ్యాంగ్ మీడియా నివేదించింది. అయితే కిమ్ సందర్శనను ఫోటోలను మాత్రం రిలీజ్ చేయలేదు.
ఉత్తర కొరియాతో అణు ఒప్పందంపై ఉత్తర కొరియాతో చర్చలు జరపడానికి ట్రంప్ ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. అయితే అమెరికా తన దూకుడును ఉత్తరకొరియాపై కాకుండా ఇరాన్ పై ప్రదర్శించడంతో కిమ్ కు కొంత ఉపశమనం అభించినట్లేనని ఓ రిపోర్ట్ తెలిపింది. జనరల్ సోలేమనీ హత్యపై ఇప్పటివరకు ఉత్తరకొరియా స్పందించలేదు.