ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు ఏమైంది ? ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా ? నెల రోజులుగా కిమ్ ఎందుకు సైలెంట్ అయ్యారు ? దీనిపై జాతీయస్థాయిలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. 2020, ఏప్రిల్ 20వ తేదీ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరు కాలేదు.
ఆయన ఎందుకు హాజరు కాలేదు ? ఆయనకు ఏమైంది ? ఆరోగ్యం బాగా లేదా ?అనే చర్చలు ప్రారంభమయ్యాయి. కొంతకాంలగా కిమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈయనకు ఏదో ఆపరేషన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే అణుపరీక్షలు, క్షిపణీ పరీక్షలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తరకొరియా నుంచి ఎలాంటి ప్రకటనలు వెలువడడం లేదు.
బ్రెయిన్ డెడ్ అయ్యారనే వార్తలను దక్షిణ కొరియా అధికార వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలను నిశితంగా పరిశీలించడం జరుగుతోందని అమెరికా వెల్లడిస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన అధికార వర్కర్స్ పార్టీ సమావేశానికి కిమ్ అధ్యక్షత వహించారు. అయితే…ఈ భేటీలో సోదరి కిమ్ యో జోంగ్ ను పొలిట్ బ్యూరో ప్రత్యామ్నాయ సభ్యురాలిగా ఎన్నుకోవడం విశేషం.
ఏప్రిల్ 12వ తేదీన యుద్ధ విమానాలను పరిశీలిస్తూ కనిపించిన కిమ్ తర్వాత..ఎలాంటి సమాచారం రాలేదు. ఇతని దినచర్య, ఇతర వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు. కేవలం ఆయనకు సన్నిహితంగా ఉండే..కొంతమందికి మాత్రమే తెలుసు. ఆయన ఆరోగ్య పరిస్థితి, ఇతర వివరాలు అధికారంగా వెలువడాల్సి ఉంది.