Kim Jong Un : కిమ్ తలకు బ్యాండేజీ..ఇప్పుడిదే హాట్ టాపిక్

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(37) మరోసారి ఆరోగ్య కారణాలతో వార్తల్లోకెక్కారు.

Kim Jong Un ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(37) మరోసారి ఆరోగ్య కారణాలతో వార్తల్లోకెక్కారు. గతేడాది కిమ్ సడెన్ గా కొన్ని నెలలపాటు అదృశ్యమడంతో అనారోగ్యంతో ఆయన చనిపోయాడన్న ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపించడం..ఆ తర్వాత కొన్ని రోజులకు కిమ్ మళ్లీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలను ఆ దేశ మీడియా విడుదల చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కూడా కిమ్ ఆరోగ్యం బాలేదంటూ పుకార్లు చక్కర్లు కొట్టడం.. ఆ తర్వాత కిమ్ సన్నబడ్డ ఫొటోలు బయటికొచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా తన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యేలా తలకు బ్యాండేజీతో కిమ్ దర్శనమిచ్చారు. జులై 24-27 మధ్య నిర్వహించిన కొరియా పీపుల్స్ ఆర్మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి ఫొటోల్లో.. కిమ్​ తల వెనక భాగంలో బ్యాండేజీ కనిపించింది. ఈ ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. అయితే జులై చివర్లో జరిగిన మరో కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నప్పటి ఫొటోల్లో.. బ్యాండేజీ స్థానంలో ఆకుపచ్చ రంగులో ఓ మచ్చ కనిపించింది.

ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్​గా మారాయి. దీంతో కిమ్​ ఆరోగ్యానికి ఏమైందని మరోసారి చర్చ ఊపందుకుంది. అయితే, కిమ్ ఆరోగ్యం అసాధారణంగా ఏమీ లేదని దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. బ్యాండేజీ తీసేసిన తర్వాత తలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని అధికారులు పేర్కొన్నట్లు దక్షిణ కొరియా మీడియా తెలిపింది. జులై 11న జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తలపై ఎలాంటి బ్యాండేజీలు కనిపించలేదని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు