International Cat Day 2023
International Cat Day 2023 : ప్రజలు పెంచుకునే జంతువుల్లో పిల్లి ఒకటి. ఒకప్పుడు ఈజిప్షియన్లు పిల్లిని దేవతగా భావించేవారు. పూజించేవారు. వాటి రక్షణకోసం, వాటికి సాయపడటం కోసం పిల్లి ప్రేమికులు ఏటా ఆగస్టు 8 న ‘అంతర్జాతీయ పిల్లి దినోత్సవం’ జరుపుతారు.
అంతర్జాతీయ పిల్లి దినోత్సవాన్ని మొదటగా 2002 లో కెనడాకు చెందిన అంతర్జాతీయ జంతు సంక్షేమ నిధి (International Fund for Animal Welfare) ప్రారంభించింది. అప్పటి నుంచి ఆగస్టు 8 న ‘ అంతర్జాతీయ పిల్లి దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈరోజు పిల్లిని రక్షించే మార్గాలు, పిలుల్ల్ని దత్తత తీసుకోవడం మొదలైన అంశాలపై అవగాహన కల్పిస్తారు. పిల్లుల్ని మనదేశంలో పెంచుకోవడానికి పెద్దగా మొగ్గు చూపరు కానీ చాలా దేశాల్లో పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటారు.
కొందరు పిల్లి ఎదురు వస్తే అపశకునంగా భావిస్తారు. వెళ్లిన పని కాదని నమ్ముతారు. అందులోనూ నల్లపిల్లి ఎదురువస్తే ఇక ఆ పని జరిగినట్లే అని బలంగా నమ్ముతారు. అయితే ఈజిప్షియన్లు మాత్రం పిల్లుల్ని దేవుళ్లుగా భావించేవారట. వారి రాజవంశం కూలిపోయిన తరువాత పిల్లులు ప్రతి చోట ప్రాచుర్యం పొందాయి. గ్రీకులు, రోమన్లలో ధనవంతులు వద్ద పిల్లులు ఉండేవి. అయితే మధ్య యుగంలో ఐరోపాలో పిల్లులపై మూఢ నమ్మకాలు బయలుదేరాయి. 1348 నుంచి 1600 ప్లేగుకు ఎలుకలు మరియు పిల్లులు కారణమని పిల్లుల్ని చంపడం మొదలుపెట్టారట.
2002 లో అంతర్జాతీయ పిల్లి దినోత్సవాన్ని ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ (IFAW) నుంచి 2020 లో ఇంటర్నేషనల్ క్యాట్ కేర్ ‘క్యాట్ డే’ సంరక్షకత్వాన్ని తీసుకుంది. ఈ దినోత్సవం ద్వారా వాటిని రక్షించడమే ప్రధాన ధ్యేయంగా వీరు పని చేస్తున్నారు. ఫిబ్రవరి 2020 నాటి PDSA (Plan Do Study Act) పరిశోధన ప్రకారం UK లో పెంపుడు కుక్కల కంటే కూడా పెంపుడు పిల్లులు ఎక్కువగా ఉన్నాయట. చైనాలో కూడా ఇదే పరిస్థితి. ప్రపంచంలో పిల్లుల సంఖ్య 600 మిలియన్ల వరకూ ఉంటుందని కూడా ఒక అంచనా. ఇందులో 70 మిలియన్ల పిల్లులు యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నాయి. ఇక ఈరోజంతా పిల్లి ప్రేమికులు తమ పెంపుడు పిల్లులకు సెలబ్రేషన్స్ చేస్తారు.