Lalit Modi : లలిత్ మోదీకి బ్రిటన్ పౌరసత్వం.. ఇక ఇండియాకు తీసుకురాలేమా..? అసలు చట్టం ఏం చెబుతోంది..
Lalit Modi British citizenship : లలిత్ మోదీకి బ్రిటన్ పౌరసత్వం రావడంతో ఆయనను భారత్‌కు తీసుకురావడం మరింత సంక్లిష్టంగా మారిందా? భారత్–బ్రిటన్ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ఏం చెబుతోంది? మాల్యా కేసు నేపథ్యంలో లలిత్ మోదీని భారత్‌కు రప్పించేందుకు ఉన్న చట్టపరమైన అవకాశాలేమిటో తెలుసుకుందాం.
- Harish Thanniru
- Updated on- November 16, 2026 / 05:14 PM IST
Lalit Modi British citizenship
Lalit Modi British citizenship : లలిత్ మోదీ.. ఈ పేరు వినగానే క్రికెట్‌పై అవగాహన కలిగిన వారికి ముందుగా గుర్తుకొచ్చేది ఐపీఎల్. భారత క్రికెట్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఐపీఎల్ వ్యవస్థాపకుడే లలిత్ మోదీ. ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాక బీసీసీఐ అతన్ని సస్పెండ్ చేసింది. ఆ తరువాత 2010 మే నెలలో లలిత్ మోదీ ఇండియా నుంచి లండన్ వెళ్లిపోయాడు.
Also Read : Jay Shah : ప్రపంచ క్రికెట్లో జై షా హవా.. ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి ఎన్నిక! నెక్ట్స్ టార్గెట్ ఇదే..!
నగదు అక్రమ చలామణి కేసులో ఈడీ జారీ చేసిన సమన్లకు లలిత్ మోదీ స్పందించలేదు. దీంతో బెయిల్‌కు వీల్లేని వారెంటును (ఎన్బీడబ్ల్యూ) 2015లో ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసింది. అప్పటి నుంచి లలిత్ మోదీని ఇండియాకు తీసుకొచ్చేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం, ఆయనకు బ్రిటన్ పౌరసత్వం లభించింది. దీంతో ఆయన్ను ఇండియాకు తీసుకురావడం సాధ్యమేనా? బ్రిటన్ పౌరసత్వం పొందిన తర్వాత భారత దర్యాప్తు సంస్థల ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడతాయా? అనే చర్చ మొదలైంది.
పౌరసత్వంతో తప్పించుకుంటాడా?
ఇండియాలో ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీకి బ్రిటన్ పౌరసత్వం లభించండం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2010లో భారత్‌ను విడిచివెళ్లిన ఆయన.. సుమారు 16ఏళ్ల తర్వాత బ్రిటన్ పౌరుడిగా మారిన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. బ్రిటన్ తన ఇల్లని, అనేక ఏళ్ల తర్వాత ఇప్పుడు సగర్వంగా బ్రిటిష్ పౌరుడినయ్యానని సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. ఇది వ్యక్తిగతమైన, ప్రత్యేకమైన మైలురాయి అని అభివర్ణించారు. సెప్టెంబరు 15న లండన్‌లో జరిగిన పౌరసత్వ వేడుకల చిత్రాలను దీనికి జత చేశారు. అయితే, బ్రిటన్ పౌరసత్వం పొందినంత మాత్రాన లలిత్ మోదీని భారత్‌కు అప్పగించడానికి చట్టపరంగా పూర్తిగా మార్గాలు మూసుకుపోలేదు. కానీ ఆయనను తీసుకురావడానికి భారత్ మరింత పటిష్టమైన న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది.
గతంలో ఇండియాకు తీసుకురావడం ఎందుకు సాధ్యం కాలేదు..
భారత్‌లో ఆయనపై ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. 2015లో ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం మనీలాండరింగ్ కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా, 2025లో లలిత్ మోదీ వనాటు అనే పసిఫిక్ ద్వీప దేశ పౌరసత్వాన్ని పొందినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భారత్ చేసిన విజ్ఞప్తితో ఆ పౌరసత్వం రద్దయింది. తాజాగా 2026 సెప్టెంబర్ 15న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ పౌరసత్వం పొందినట్లు ఆయన వెల్లడించారు.
1992 ఒప్పందం ఏం చెబుతుంది..?
లలిత్ మోదీ వ్యవహారం నేపథ్యంలో భారత్, బ్రిటన్ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం అత్యంత కీలకంగా మారింది. నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న, లేదంటే శిక్ష పడిన వ్యక్తులు మరో దేశంలో ఉన్నప్పుడు, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా వారిని కోరిన దేశానికి అప్పగించేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. భారత్, బ్రిటన్ మధ్య 1992 సెప్టెంబర్ 22న లండన్‌లో ఈ ఒప్పందం కుదిరింది. అయితే, ఒప్పందం కుదిరిన వెంటనే అమల్లోకి రాలేదు. 1993 నవంబర్ 15న రెండు దేశాలు ఆమోద పత్రాలను మార్చుకున్న తర్వాత అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఒక దేశానికి చెందిన పౌరుడిని మరో దేశానికి అప్పగించడానికి ఆ వ్యక్తి పౌరసత్వం ఒక్కటే అడ్డంకి కాదని స్పష్టంగా పేర్కొన్నారు.
ఇక్కడే చాలామందికి ఒక సందేహం వస్తోంది. లలిత్ మోదీ ఇప్పుడు బ్రిటన్ పౌరుడు. అలాంటప్పుడు బ్రిటన్ ప్రభుత్వం తన దేశ పౌరుడిని భారత్‌కు అప్పగిస్తుందా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీనికి సమాధానం 1992 అప్పగింత ఒప్పందంలోని నాలుగో అధికరణంలో ఉంది. దీని ప్రకారం.. కోరబడిన దేశం తన పౌరుడిని అప్పగించడానికి ఈ ఒప్పందం ఎలాంటి నిషేధం విధించదు. అంటే బ్రిటన్ పౌరసత్వం పొందిన వ్యక్తిని కూడా భారత్‌కు అప్పగించేందుకు చట్టపరమైన అవకాశం ఉంది.
ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్ పౌరుడైనా ఇండియాకు అప్పగించమని అడగొచ్చు. కానీ, బ్రిటన్ పౌరుడు కాబట్టి ఆయన హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకుంటామని ఇండియా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతర్జాతీయ కోర్టు చట్టాలు, ఖైదీల హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మన జైళ్లలో సౌకర్యాల మీద గతంలో విజయ్ మాల్యా కేసు వేసి ఇండియాకు రాకుండా తప్పించుకున్నాడు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో లలిత్ మోదీని ఇండియాకు తీసుకురావడం అసాధ్యమని చెప్పలేం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఒప్పందంలో అవకాశం ఉండటం వేరు.. వాస్తవంగా అప్పగింత జరగడం వేరు. బ్రిటన్ చట్టాలు, న్యాయస్థానాల పరిశీలన, సమర్పించే ఆధారాలు, ఆరోపణల తీవ్రత, మానవ హక్కుల అంశాలు ఇందులో కీలకంగా మారతాయి.
