Scientists Search 300 year Old wheats : 300 ఏళ్ల నాటి గోధుమలపై శాస్త్రవేత్తల పరిశోధనలు .. ఇక పురాతనకాలంనాటి ఆహారమే దిక్కు కాబోతోందా?

scientists search 300 year old wheats :  తెలియకుండానే కరువు కోరల్లోకి ప్రపంచం వెళ్లిపోతోంది. ఇలాంటి సమయంలో ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనా పండే ఆహారపదార్థం కావాలి. అసలు ఎందుకు గోధుమల మీదే సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. పాతరకం పంటలే మనకు మళ్లీ దిక్కు అయ్యాయా.. అసలు సైంటిస్టుల పరిశోధనల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు ఏంటి ?

లండన్‌లోని నేచరల్‌ మ్యూజియంలో పాత రకాల గోధుమలను వందల కొద్దీ ఫైల్స్‌లో వరుసగా, జాగ్రత్తగా భద్రపరిచారు. ఒక్కొక్క గోధుమ రకానికి సంబంధించిన ఎండిన ఆకులు, కొమ్మలు, గింజలు అన్నీ స్టోర్‌ చేశారు. ఇవన్నీ కొన్ని వందల ఏళ్ల నాటి గోధుమ రకాలు. వాటి పేర్లు, అవి ఎక్కడ, ఎప్పుడు లభమయ్యాయి మొదలైన వివరాలను జాగ్రత్తగా ఉంచారు. ఇందులో దృఢమైన రకాల జన్యు నిర్మాణాన్ని కనిపెట్టేందుకు.. వాటి జీనోమ్ సీక్వెన్స్‌ను సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుత గోధుమలతో పోలిస్తే.. ఇక్కడ స్టోర్ చేసిన గోధుమలు చాలా భిన్నంగా ఉంటాయ్. అవి గడ్డి పోలికలో ఉంటాయ్. ఈ తేడానే ప్రయోజనాలు అందిస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచంలోని అతి ముఖ్యమైన పంటల్లో గోధుమ ఒకటి. దీన్ని అనేక ఆహారపదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. రొట్టెలు, బ్రెడ్, పాస్తా, సెరల్స్‌, కేక్స్.. ఇలా గోధుమ మనం తినే ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఐతే వాతావరణ మార్పులు, తెగుళ్లు, వ్యాధులు… ప్రపంచవ్యాప్తంగా గోధుమ పంటను నాశనం చేస్తున్నాయ్. ఉష్ణోగ్రతలలో ఒక డిగ్రీ సెల్సియస్‌ పెరిగినా… ప్రపంచవ్యాప్తంగా పండించే గోధుమ పంటలో 6.4శాతం వరకు నష్టం వస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రపంచం అన్ని రకాలుగా ఆకలి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ఇప్పుడు సైంటిస్టులు ప్రయోగాలు ముమ్మరం చేస్తున్నారు.

1950, 1960 హరిత విప్లవం… అధిక దిగుబడిని ఇచ్చే పంటరకాల అన్వేషణకు దారితీసింది. దీంతో ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే పంట సహా ఇతర రకాలు మూలన పడిపోయిన పరిస్థితి. ఐతే మనం కోల్పోయిన రకాలను పునరుద్ధరించి.. ఆధునిక కాలానికి తీసుకురాగలమా లేదా అని పరీక్షించడమే ఇప్పుడు సైంటిస్టుల లక్ష్యం. ఇలా ఒకరకంగా పాతకాలం పంటలే మళ్లీ దిక్కు అయ్యే పరిస్థితులు ఉన్నాయ్. ఓ వైపు జనాభా పెరుగుతుండడం.. మరోవైపు వాతావరణంలో మార్పు.. ఇలాంటి సమయంలో భవిష్యత్‌లో భారీగా డిమాండ్ పెరిగే చాన్స్ ఉంటుంది. దీంతో గోధుమలు పండించ లేని చోట కూడా వాటిని పండించగలిగే రకాల కోసం సైంటిస్టులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. వాతావరణ మార్పులకు తట్టుకునే పంట రకాల కోసం కూడా వెతుకుతున్నారు.

ఇక అటు పోషకాహార విలువలు ఎక్కువగా ఉన్న రకాలపై కూడా సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. గోధుమ రైతులు ఇంకా పూర్తిగా వాడుకోని రకాలు చాలా ఉన్నాయి. వాటిని మళ్లీ వారికి అందించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇక అటు చరిత్రలో చరిత్రలో పండించిన గోధుమ రకాలను.. పునరుద్ధరించగలిగితే ప్రపంచ ఆహారభద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని వారి ఆలోచన. ఇలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది అన్ని విషయాలకు వర్తిస్తుంది.. చివరికి ఆహారంతో సహా ! కాలుష్యం కోరల్లో చిక్కుకొని.. వాతావరణ మార్పులు సంభవిస్తున్న వేళ.. మళ్లీ పాతకాలం నాటి ఆహారమే ఇప్పుడు దిక్కు కాబోతోంది..

ట్రెండింగ్ వార్తలు