Mali Woman Gives Birth To Nine Babies
Mali Woman Gives Birth To Nine Babies : కొంతమంది మహిళలు ఒకే కాన్పులో కవల పిల్లలకు జన్మనివ్వడం చూశాం. ఇంకొంత మంది ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మనివ్వడం చూశాం. అదే పెద్ద వండర్ అనుకున్నాం. కానీ, ఒకే కాన్పులో 9మందికి జన్మనివ్వడం చూశారా? కనీసం విన్నారా? అవును నిజమే. అదే జరిగింది. ఓ 25 ఏళ్ల మహిళ చరిత్ర సృష్టించింది. ఏకంగా ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చి యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది.
పశ్చిమాఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హలీమా సిస్సే(25) 9 నెలల క్రితం గర్భం దాల్చింది. నెలలు నిండుతున్న కొద్ది ఆమెకు డాక్టర్లు స్కానింగ్ చేశారు. ఈ పరీక్షల్లో ఆమె కడుపులో ఏడుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించి విస్తుపోయారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను మార్చిలో మాలీలోని మోరాకోకు తరలించారు. ఆ గర్భిణి మంగళవారం(మే 4,2021) డెలివరీ అయింది.
డాక్టర్లు ఏడుగురు పిల్లలే జన్మిస్తారు అనుకున్నారు. కానీ అదనంగా మరో ఇద్దరు శిశువులు పుట్టేసరికి షాక్ అయ్యారు. వీరిలో ఐదుగురు ఆడపిల్లలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పిల్లలో కొందరు బలహీనంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. హలీమాకు సీజేరియన్ చేశారు డాక్టర్లు. ఒకే కాన్పులో 9మంది పిల్లలను కనిందనే వార్త ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఇది వరల్డ్ వండర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా, ఇలా పుట్టిన శిశువులకు తరుచూ ఆరోగ్య సమస్యలు రావొచ్చని డాక్టర్లు అంటున్నారు.