అతడో దొంగ.. ఎప్పటిలానే ఆ రోజు కూడా దొంగతనం చేసేందుకు వెళ్లాడు. అక్కడో కారు ఉంది. కారులో విలువైన వస్తువులను దొంగలించేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరికి అతడి ముఖమే పగిలిపోయింది. రోడ్డు పక్కన నిలిపిన కారు అద్దాలను ఇటుకతో బ్రేక్ చేయబోయాడు. దురదృష్టవశాత్తూ ఆ ఇటుక అద్దానికి తగిలి అదే వేగంతో గాల్లోకి ఎగిరి తిరిగి తన ముఖాన్ని గట్టిగా తాకింది. ముఖం పచ్చడి కావడంతో దొంగ విలవిల లాడిపోయాడు. ఈ ఘటన బ్రాండన్ లోని మార్టిన్ క్రాయాగ్ అనే వ్యక్తి ఇంటి దగ్గర జరిగింది. దీనికి సంబంధించిన వీడియో క్రాయాగ్ ఇంటి సీసీ కెమెరాలో రికార్డు అయింది.
ఆ వీడియోను క్రాయాగ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు. కారు దగ్గరకు వచ్చి అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇటుక తీసుకొచ్చి గట్టిగా అద్దాలపై విసిరికొట్టాడు. కానీ, కారు అద్దాలు పగలక పోగా.. ఇటుక గాల్లోకి ఎగిరి వచ్చి అంతే వేగంతో అతడి ముఖాన్ని గట్టిగా తాకింది.
ముఖంపై చేతులను అడ్డుగా పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. బురదలో రాయి వేస్తే.. అది ఎగిరి వారి ముఖంపైనే చిమ్ముతుంది అనేదానికి ఇదొక ఉదాహరణ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..