Charlie Kirk
Charlie Kirk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31)ను ఓ దుండగుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఉటా విశ్వవిద్యాలయంలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ దుండగుడిని అమెరికా ఇంకా పట్టుకోలేకపోయింది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు అన్ని ప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు. నిందితుడిని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
నిందితుడు కాల్పులకు పాల్పడ్డ తర్వాత ఉటా విశ్వవిద్యాలయ పైకప్పుపై నుంచి పరిగెత్తుతుండగా, గోడల పై నుంచి దూకుతుండగా సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. అయితే, అతడి ముఖం స్పష్టంగా కనపడలేదు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు.
కాల్పులు జరపడం వెనుక అతడి ఉద్దేశం ఏంటన్న విషయంపై కూడా అధికారులు ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. నిందితుడి ఫొటోలు, వీడియోలు పోలీసు, ఫెడరల్ దర్యాప్తు అధికారులు విడుదల చేశారు. (Charlie Kirk)
Also Read: ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము
నిందితుడి గురించి సమాచారం తెలిస్తే చెప్పాలని ప్రజలను ఎఫ్‌బీఐ అధికారులు కోరారు. వర్సిటీ పైకప్పుపై ఒక చేతి ముద్ర, చెప్పుల ముద్ర, సమీప అడవిలో వేట తుపాకీ దొరికినట్లు తెలిపారు. నిందితుడు అక్కడికే పారిపోయాడని అధికారులు భావిస్తున్నారు.
ఉటా పబ్లిక్ సేఫ్టీ శాఖ విడుదల చేసిన ఫొటోల ద్వారా నిందితుడు తెల్లజాతి వ్యక్తేనని తెలుస్తోంది. అతడు కన్వర్స్ చెప్పులు, జీన్స్ వేసుకుని ఉన్నాడు. అమెరికా జెండా, ఈగల్ ముద్రలతో ఉన్న బ్లాక్ లాండ్ స్వీవెడ్ టీషర్టు, ట్రైయాంగిల్ ఉన్న నల్ల టోపీ ధరించాడు.
suspect shooter pic of charlie kirk murder
దర్యాప్తు అధికారులు సమీప అడవిలో ఒక బోల్ట్ యాక్షన్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. దానితోనే నిందితుడు కాల్పులు జరిపాడని భావిస్తున్నారు. అది “హై పవర్డ్ బోల్ట్ యాక్షన్ రైఫిల్” అని చెప్పారు.
కిర్క్‌పై కాల్పులకు బాధ్యులైన వారిని గుర్తించి, సమాచారం ఇస్తే $100,000 (రూ.88 లక్షలు) రివార్డు ఇస్తామని అమెరికా అధికారులు ప్రకటించారు.