ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న వానలు, ధూళి తుఫానులు

  • Publish Date - January 22, 2020 / 03:11 AM IST

ఆస్ట్రేలియాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఒక పక్క అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే, మరో పక్క వడగళ్ల వానలు, వరదలుతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఆకాశాన్ని కమ్మేసిని ధూళి దండయాత్ర చేస్తున్నట్లు గ్రామాలు, పట్టణాలపై విరుచుకు పడింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు సోమవారం రాజధాని కాన్బెర్రాలో కురిసిన వడగళ్ల వానకు ప్రజాజీవనం అతలాకుతలం అయ్యింది. రోడ్లపై పార్క్ చేసిన కార్లు, అనేక భవనాలు దెబ్బతిన్నాయి. వడగళ్ల వాన ధాటికి శివారు ప్రాంతంలో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అనేక చోట్లు చెట్లు నేలకూలాయి. ఆస్ట్రేలియాలో రెండవ అతి పెద్ద నగరమైన మెల్ బోర్న్ లోనూ ఆదివారం వడగళ్ళ వాన కురిసింది. వడగళ్ళవాన, ధూళి తుపానులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మరోవైపు ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌లో హోరు గాలితో ఆకాశాన్ని కమ్మేసిన ధూళి తుఫాను నారోమైన్ పట్టణాన్ని చుట్టుముట్టింది. మధ్యప్రాచ్యంలో ఇలాంటి ధూళి తుఫానులు సహజమేకానీ, ఆసీస్‌లో ఇలా జరగడం చాలా అరుదని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా డబ్బో, ఆపై పార్క్స్ ఇలా ఒక్కో సిటీనే కమ్మేస్తూ ముందుకుసాగింది. దీని వల్ల ఈ ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు కరెంట్ లేకుండా పోయింది.

ధూళి తుఫాను మూలంగా న్యూ సౌత్ వేల్సే టౌన్ ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. దుమ్ము దుప్పటిలా నగరాన్ని పరుచుకుంది.వీటికి సంబంధించిన వీడియోలను, పోటోలను ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.