Pakistan : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 32మంది మృతి.. లభించని మరో 10మంది ఆచూకీ

Pakistan : పాకిస్థాన్‌‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో 32మంది కార్మికులు మృతి చెందారు.

Massive explosion in coal mine in Pakistan 32 workers died.

Pakistan : పాకిస్థాన్‌‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా నగర శివారులో ఉన్న బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో 32మంది కార్మికులు మృతి చెందగా, మరో 10 మంది గనిలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు గనిలో భారీగా మీథేన్ వాయువు పేరుకుపోవడమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Also Read : AP Crime : ఏపీలో దారుణ ఘటన.. బిక్షాటన చేస్తున్న బాలికను హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి..

పేలుడు అనంతరం సహాయక బృందాలు వెంటనే రంగంలోకిదిగి గాలింపు చర్యలు చేపట్టాయి. మొదట ఏడుగురు మృతదేహాలను వెలికితీయగా, కొద్ది గంటల తరువాత మరో 25 మృతదేహాలను గుర్తించారు. గనిలో చిక్కుకుపోయిన మిగిలిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఆక్సిజన్ కొరత కారణంగా గనిలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 5 లక్షల పాకిస్థానీ రూపాయల పరిహారం ప్రకటించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, గనుల్లో భద్రతా ప్రమాణాలను పునఃసమీక్షిస్తామని బలూచిస్తాన్ గనులు, ఖనిజాల శాఖ మంత్రి షోయబ్ నోషెర్వానీ తెలిపారు.

ఇదిలాఉంటే.. బొగ్గు గని ప్రమాదంపై పాకిస్థాన్ సెంట్రల్ మైన్స్ లేబర్ ఫెడరేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గనుల్లో భద్రతా నిబంధనలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆరోపించింది. గని భద్రతా చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

బలూచిస్థాన్ ప్రాంతంలో బొగ్గు గని ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. అనేక గనుల్లో సరైన గాలి ప్రసరణ వ్యవస్థలు, మీథేన్ వంటి ప్రమాదకర వాయువులను గుర్తించే పరికరాలు, ఇతర భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శించాయి.