కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 41 మంది సజీవ దహనం

మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Kuwait Fire Incident : గల్ఫ్ దేశం కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగాఫ్ నగరంలోని ఓ అపార్ట్ మెంట్ లో సడెన్ గా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు అపార్ట్ మెంట్ అంతా వ్యాపించాయి. మరోవైపు దట్టమైన పొగ బిల్డింగ్ అంతా కమ్మేసింది. మంటల్లో చిక్కుకుని 41మంది సజీవ దహనం అయ్యారు. మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు కేరళ వాసులు సహా 10మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనంలో 160మందికిపైగా ఉన్నారు. వారంతా పొట్టకూటి కోసం కువైట్ కు వెళ్లిన వారు. కువైట్ కాలమానం ప్రకారం ఉదయం 4.30 గంటలకు ప్రమాదం జరగటంతో కార్మికులంతా భవనంలోనే ఉండిపోయారు. దీంతో చాలామంది మంటల్లో చిక్కుకుని చనిపోయారని కువైట్ పోలీసులు తెలిపారు. మొదటి ఓ వంట గదిలో మంటలు చెలరేగాయని, తర్వాత అపార్ట్ మెంట్ లోని గదుల్లోకి మంటలు వ్యాపించాయని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైన భవనంలో అధికంగా కార్మికులే నివాసం ఉంటున్నారు.

”అది ఓ కంపెనీకి చెందిన 6 అంతస్తుల భవనం. అందులో 160మంది నివాసం ఉంటున్నారు. కిచెన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఉంటున్న వారంతా ఆ కంపెనీలో పని చేసే వారే. అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు 5వ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశారు. అయితే, వారు మరణించారు. అగ్నిప్రమాదం ఘటనలో 41మంది చనిపోయారు. 50మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో వర్కర్లకు నివాసం కల్పిస్తారు. అక్కడ చాలా మంది వర్కర్లు ఉన్నారు. చాలామందిని కాపాడగలిగాం. కానీ దట్టమైన పొగతో ఊపిరాడక దురదృష్టవశాత్తు పలువురు చనిపోయారు” అని స్థానిక అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం కల్పించాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఆరా తీసింది. ఇది చాలా దురదృష్టకరం అని వాపోయింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని కువైట్ ఎంబసీ అధికారులను కోరింది.

Also Read : కథువాలో వరుస దాడులు.. గ్రామస్థుల ఇంటింటికీ వెళ్లి నీళ్లు అడుగుతున్న ఉగ్రవాదులు!

ట్రెండింగ్ వార్తలు