The Hidden Power Behind the Crown : ప్రిన్స్ హ్యారీని మేఘన్ మార్కెల్ బెదిరించి వివాహం చేసుకున్నారంటున్న రాయల్ ఫ్యామిలీ మీడియా

బ్రిటన్ ప్రిన్స్ హ్యారీని మేఘన్ మార్కెల్ బెదిరించి పెళ్లిచేసుకున్నారా...? అవుననే అంటున్నారు రాజకుటుంబం వార్తలను కవర్ చేసే టైమ్స్ జర్నలిస్ట్. రాజకుటుంబంపై ఆయన రాసిన కర్టియర్స్: ద హిడెన్ పవర్ బిహైండ్ ది క్రౌన్ అనే పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించారు.

Prince Harry-Meghan Markle..The Hidden Power Behind the Crown book : మేఘన్ మార్కెల్ రాజకుటుంబంలో ఇమిడిపోవాలని అనుకోలేదా…? రాయల్ డ్యూటీస్‌ నుంచి బయటకు వెళ్లాలనే ఆమె భావించారా..? రాజభవనం సిబ్బందితో కూడా ఆమె ప్రవర్తన సరిగా లేదా..? ప్రిన్స్ హ్యారీని ఆమె బెదిరించి పెళ్లిచేసుకున్నారా…? అవుననే అంటున్నారు రాజకుటుంబం వార్తలను కవర్ చేసే టైమ్స్ జర్నలిస్ట్. రాజకుటుంబంపై ఆయన రాసిన కర్టియర్స్: ద హిడెన్ పవర్ బిహైండ్ ది క్రౌన్ అనే పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించారు.

రాణి ఎలిజబెత్ మరణంతో రాజకుటుంబంలో విభేదాల గురించి మరోసారి చర్చ జరుగుతోంది. ఈ విషాదం తర్వాత ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ హ్యారీ కలిసిపోతారని అంతా భావించారు. కానీ ప్రస్తుతానికి అలాంటిదేమీ జరిగే సూచన కనిపించడం లేదు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ను తిరిగి రాజకుటుంబంలోకి ఆహ్వానించడంపై రాజు చార్లెస్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు తాజాగా రాజకుటుంబంపై విడుదలైన ఓ పుస్తకం సంచలన విషయాలను బయటకు తెచ్చింది. రాజకుటుంబం విధుల నుంచి బయటకు వస్తున్నామని ప్రకటించి..కాలిఫోర్నియాలో స్థిరపడ్డ డ్యూక్ అండ్ డచెస్ ఆప్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌పై ఆ పుస్తకంలో తీవ్ర విమర్శలు చేశారు టైమ్స్ జర్నలిస్ట్ వాలైంటైన్ లో. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో వివక్ష ఉందని హ్యారీ, మేఘన్ ఆరోపిస్తే….అసలు రాజకుటుంబం నుంచి బయటకు వెళ్లాలన్న వ్యూహంతోనే మేఘన్ అడుగులు తొలి నుంచీ సాగాయని ఈ పుస్తకం విమర్శించింది.

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ వివాహానికి దారితీసిన పరిస్థితులు, పెళ్లి, బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో హ్యారీ దంపతుల ప్రవర్తన గురించి ఈ పుస్తకంలో వివరంగా రాశారు వాలెంటెయిన్. ప్రిన్స్ హ్యారీని ఒత్తిడి చేసి మేఘన్ పెళ్లిచేసుకుందని పుస్తకంలో ఆరోపించారు. తనను గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రకటించకపోతే..బ్రేకప్ చెప్తానని మేఘన్ హ్యారీని బెదిరించిందని, దీంతో ఆందోళన చెందని హ్యారీ తమ రిలేషన్ గురించి ప్రకటించారని తెలిపారు. మేఘన్ తనను అశక్తుణ్ని చేసిందని హ్యారీ నిర్వేదం వ్యక్తం చేసినట్టు చెప్పారు. వివాహం రోజు మేఘన్ ధరించిన దుస్తులపైనా ఈ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించారు.

అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న మేఘన్‌..హ్యారీతో పెళ్లిరోజు…పూర్తి స్వచ్ఛతను సూచించే తెల్లని గౌను వేసుకోవడం చూసి రాణి ఎలిజబెత్ ఆశ్చర్యపోయిందన్నారు. బ్రిటిష్ సంప్రదాయంలో విడాకులు తీసుకున్న మహిళలు అలాంటి డ్రెస్ వేసుకోరని, మేఘన్ కూడా చార్లెస్‌తో వివాహం రోజు కెమిల్లా వేసుకున్నట్టుగా తెలుపు, గోధుమరంగు కలిసిన డ్రెస్ వేసుకుంటుందని రాణి భావించారన్నారు.

రాజకుటుంబం సిబ్బందితో మేఘన్ ఎప్పుడూ మర్యాదగా ప్రవర్తించలేదని పుస్తకంలో ఆరోపించారు. మేఘన్ దురుసుగా వ్యవహరించినట్టు ప్యాలెస్‌లో ఆమెకు వ్యక్తిగత సిబ్బందిగా వ్యవహరించినవారు చెప్పారు. రాజకుటుంబంలో ఓ సభ్యురాలిగా మేఘన్‌ను ఇముడ్చుకునేందుకు అందరూ ప్రయత్నించినా..ఆమె మాత్రం రాయల్ డ్యూటీస్ నుంచి బయటకు వెళ్లే ఆలోచనతోనే ఉన్నారన్నారు. ఆమెను సంతోషంగా ఉంచడానికి అందరూ ప్రయత్నించాని..మేఘన్ మాత్రం..తన సంతోషం ఆధారంగానే రాజకుటుంబాన్ని జడ్జ్ చేశారని తెలిపారు.

రాణి ఎలిజబెత్ మరణించే సమయంలో జరిగిన విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. అంతిమ ఘడియల్లో ఉన్న రాణి దగ్గరకు మేఘన్‌ను తీసుకురావొద్దని కింగ్ చార్లెస్ కోరారని తెలిపారు. చార్లెస్‌కు నచ్చచెప్పేప్రయత్నంలో ప్రిన్స్ హ్యారీ…మిగిలిన రాజకుటుంబం ప్రయాణిస్తున్న విమానాన్ని మిస్ అయ్యారన్నారు. తర్వాత 30వేల పౌండ్లు ఖర్చుపెట్టి…ప్రయివేట్ జెట్‌లో ఆయన బల్మోరల్‌ ప్యాలెస్‌కు రాణి మరణించిన ఐదు నిమిషాల తర్వాత చేరుకున్నారని పుస్తకంలో తెలిపారు. మేఘన్‌ను రాణి దగ్గరకు అనుమతించనందుకు నిరసనగా తండ్రి చార్లెస్, సోదరుడు విలియమ్స్‌తో కలిసి భోజనం చేసేందుకు ప్రిన్స్ హ్యారీ నిరాకరించాని కూడా ఈ పుస్తకంలో వివరించారు. మొత్తంగా ఈ పుస్తకం రాజకుటుంబం విభేదాలను మరోసారి బయటపెట్టింది. అటు రాణి అంత్యక్రియలు ముగిసిన తర్వాత మేఘన్ కింగ్ చార్లెస్‌కు కలిసి చర్చించాలని కోరుతూ లేఖ రాశారు. ఈ లేఖపై చార్లెస్ స్పందన ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. అయితే రాణి ఎలిజబెత్ మాత్రం ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాజకుటుంబంలో కలిసి పోవాలని ఆకాంక్షించినట్టు తాజా పుస్తక రచయిత వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు