మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సత్య నాదేళ్ల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. వలసదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే గ్లోబల్ టెక్ పరిశ్రమకు ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. వలసదారులను ఆకర్షించడంలో విఫలమైతే దేశాల్లో ప్రపంచ సాంకేతిక పరిశ్రమ భారీ స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ‘ప్రతి దేశం.. తమ దేశీయ ఆసక్తిపై పునరాలోచించుకోవాలి’ అని బ్లూమ్ బెర్గ్ న్యూస్ ఇంటర్వ్యూలో నాదేళ్ల సూచించారు.
వలసవాదానికి అనుకూలంగా ఉండే దేశాలకు మాత్రమే ఇతర దేశీయులు వలస వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు ఇండియాలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టం CAAకు వ్యతిరేకంగా గతంలోనూ నాదేళ్ల తన నిరసన గళం వినిపించారు. పొరుగు దేశాల నుంచి వచ్చే అన్ డాక్యుమెంటెడ్ ముస్లిం వలసదారులు భారత పౌరసత్వం పొందకుండా ఈ చట్టం నిషేధిస్తుంది.
దేశ వారసత్వాన్ని చూసి గర్విస్తున్నా:
ఇతర మతస్థుల్లో వలసదారులు ఎవరైనా తమ నమోదు పత్రాలతో భారత పౌరసత్వాన్ని పొందేలా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అమలుపై సత్య నాదేళ్ల కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘నేను భారతీయ ఆశావాదిని’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘వాస్తవానికి ఈ దేశ నిర్మాణంలో 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఇండియాలో ధృడమైన పునాది ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలోనే నేను పుట్టి పెరిగాను. ఈ దేశ వారసత్వంలో చూసి నేను గర్విస్తున్నాను. అది నేను అనుభవపూర్వకంగా ప్రభావితమయ్యాను’ అని నాదేళ్ల చెప్పుకొచ్చారు.
ఇటీవలే మైక్రోసాఫ్ట్ కూడా 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలను ఆవిష్కరించింది. వాతావరణంలోని కార్బన్ స్థాయిని తగ్గించడం లేదా నిర్మూలించేందుకు వీలుగా కొన్ని కంపెనీలు, సంస్థలతో కలిసి సాంకేతికతపై పనిచేసేందుకు ప్లాన్ చేస్తోంది. వాతావరణ మార్పులతో సంభవించే విపత్తును అడ్డుకునేందుకు కర్బన్ స్థాయిని తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టనుంది.
మొదట పునరుత్పాదక శక్తిని వినియోగించుకునేలా తమ అన్ని డేటా సెంటర్ కార్యకలాపాలను నిర్వహించేలా చేయనున్నట్టు నాదేళ్ల స్పష్టం చేశారు. మరోవైపు.. గ్లోబల్ వామింగ్ కు కారణమయ్యే చమురు, గ్యాస్ కంపెనీలైన చెవ్రాన్ కార్పొరేషన్, బీపీ పీఎల్సీ, బ్లాక్ రాక్ ఇంక్, లారీ ఫింక్ వంటి కంపెనీలకు మైక్రోసాఫ్ట్, అమెజాన్.కామ్ ఇంక్ సహా ఇతర టెక్నాలజీ కంపెనీలు సాఫ్ట్ వేర్, క్లౌడ్ సర్వీసులను అందించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.