Moon (1)
చంద్రుడిపై అనేక పరిశోధనలు జరుగుతూనేవున్నాయి. చంద్రుడిపై గాలి, నీరు, జీవరాశులు ఉన్నాయా?మనుషులు జీవించడానికి యోగ్యంగా ఉందా? తదితర అనేక సందేహాలపై గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూనేవున్నారు. చంద్రుడిపై మనుషులు నివసించాలంటే అతి పెద్ద సమస్య నీరు. కానీ కేవలం నీరే కాకుండా అక్కడ ఉండే భయంకరమైన వాతావరణం కూడా సమస్యగా ఉంది.
చీకటి పడగానే ఆకాశంలో ప్రత్యక్షమై మనపై చల్లని వెన్నెల కురిపించే చంద్రుడిపై మాత్రం ఆ సమయంలో చల్లగా ఉండదు. ఏకంగా 127 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఇక మనకు కనిపించని చీకటి భాగంలో మైనస్ 173 డిగ్రీల సెల్సియస్ చలి ఉంటుంది. అలాంటి చంద్రుడిపై మనుషులు ఎక్కడ ఉండాలి? అనే ప్రశ్నకు తాజా పరిశోధనలో సమాధానం దొరికిందని నాసా పరిశోధకులు చెబుతున్నారు.
Moon Mystery : చంద్రుడికి మరో ముఖం వుందా? నిండు జాబిలిపై ఆ మచ్చలేమిటి? సైన్స్ ఏం చెప్తోంది?
చంద్రుడిపై మేర్ ట్రాంక్విలిటాటిస్ అనే ప్రాంతంలో చాలా సొరంగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుహలకు దారి చూపిస్తాయని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సొరంగాల వద్ద చేసిన పరిశోధనల్లో వీటి ఉష్ణోగ్రతలు పెద్దగా మారడం లేదని అటూ ఇటుగా 17 డిగ్రీల సెల్సియస్ వద్దనే ఉంటున్నాయని తేలింది. నాసాకు చెందిన లూనార్ రికనసెన్స్ ఆర్బిటర్ ఈ వివరాలను సేకరించింది. అంటే ఈ సొరంగాల్లోకి వెళ్లి అక్కడి గుహల్లో మనుషులు ఉండి, పరిశోధనలు చేయవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్ ఏంజెలిస్ (యూసీఎల్‌ఏ) పరిశోధకులు కూడా ఇదే మాట చెప్పడం శోచనీయం. ఈ గుహల్లో వ్యోమగాములు ఉండి తమ పరిశోధనలు కొనసాగించే అవకాశం ఉందని తెలిపారు. ఒకప్పుడు మనిషి గుహల్లోనే బతికేవాడని, ఇప్పుడు మళ్లీ చంద్రుడిపై గుహల్లోనే జీవితం ప్రారంభించాల్సి ఉంటుందని ఈ పరిశోధకులు వివరించారు.