×
Ad

Guinea: గినియాలో ఘోర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘర్షణ.. 100 మందికిపైగా మృతి

గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ్ గౌరవార్ధం ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహించారు.. ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో..

Guinea Football match

Clashes at Football match in Guinea: పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గినియా దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ లో రెండు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటంతో 100మందికిపైగా మరణించారు. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులు చేసుకోవటంతో వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: తీవ్ర విషాదం.. బుల్లితెర నటి శోభిత బలవన్మరణం…

గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ్ గౌరవార్థం ఆదివారం ఈ  ఫుట్‌బాల్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకోవటంతో ఈ ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వేలాది మంది అభిమానులు రోడ్లపై వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. కొందరు పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వందమందికిపైగా మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.