కరోనాలో ప్రాణాంతకమైన కొత్త కోణం…గడ్డకడుతున్న పేషెంట్ల రక్తం,బ్రెయిన్ స్టోక్ అవకాశం

కోవిడ్-19ను ఎదుర్కొనే సమయంలో డాక్టర్లకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వైరస్ ప్రభావం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఏ వైరస్‌ ద్వారా చవిచూడని అనూహ్య పరిణామాలను కరోనా వైరస్‌ పేషెంట్లలోడాక్టర్లు గమనిస్తున్నారు. న్యూయార్క్‌లోని మౌంట్ సినయ్ హాస్పిటల్ లో.. కరోనా పాజిటివ్ పేషెంట్ల రక్తంలో వింత మార్పులను గమనించారు. కరోనా సోకిన రోగుల ఒక్కో శరీరభాగంలో రక్తం చిక్కబడిపోవడం,గడ్డకట్టడం వంటి ప్రమాదకర లక్షణాలను డాక్టర్లు గుర్తించారు. ఊపిరితిత్తులలోని కొన్ని భాగాల్లో రక్తం చుక్క లేకపోవడాన్ని కూడా గమనించినట్టు తెలిపారు. ఈ విధంగా వైరస్‌.. రోగి శరీరాన్ని మరింత కుంగదీస్తున్నదని న్యూయార్క్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా శరీరంలోని అవయవాలకు రక్తప్రసరణ నిలిచిపోయి పేషెంట్ త్వరగా మృత్యు అంచులకు చేరుకునే ప్రమాదం ఉందని గ్రహించారు.

పేషెంట్ల మెదడు భాగంలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నట్టు డాక్లర్లు వివరించారు. పలువురు కోవిడ్-19 పేషెంట్లలో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మొదటి లక్షణంగా బయటపడుతున్నట్టు గుర్తించారు. ఇప్పటికే వైద్య శాస్త్రానికి అంతుచిక్కకుండా ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్.. ఇప్పుడిలా కొత్త రకం దాడిని కూడా మొదలుపెట్టడం మరింత భయానక పరిస్థితులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.

మౌంట్ సినయ్‌లోని ఓ నెఫ్రాలజిస్ట్ నిపుణుడు ఇటీవల కరోనా సోకిన ఓ కిడ్నీ డయాలసిస్ పేషెంట్‌లో కాథటెర్స్‌లో రక్తం గడ్డకట్టడాన్ని గమనించారు. కోవిడ్-19 పేషెంట్లకు మెకానికల్ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న కొంతమంది పుల్మోనాలజిస్టులు.. పేషెంట్ల ఊపిరితిత్తులు రక్తం లేకుండా ఉండటాన్ని గమనించారు.  తాజా పరిణామాల నేపథ్యంలో వివిధ స్పెషాలిటీ వైద్యులు తమ దృష్టికి వచ్చిన అనుభవాలను పంచుకున్నారు. దీని నుంచి కరోనా చికిత్స కోసం ఒక కొత్త ప్రోటోకాల్‌ను అభివృద్ది చేశారు.

ఇకనుంచి కరోనా వైరస్ పేషెంట్లకు రక్తం పలచబడేందుకు అధిక మోతాదులో డ్రగ్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ముందు జాగ్రత్త చర్య ద్వారా పేషెంట్‌లో రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని తగ్గించవచ్చునని భావిస్తున్నారు. రక్తం గడ్డ కడితే దాని ప్రభావం పేషెంట్‌పై తీవ్రంగా ఉంటుందని.. కాబట్టి దాన్ని తగ్గించగలిగితే వైరస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చునని చెబుతున్నారు. అయితే హైరిస్క్‌లో పేషెంట్స్‌లో మాత్రం దీన్ని ఉపయోగించవద్దని నిర్ణయించారు. అలాంటివాళ్లలో ఈ డ్రగ్స్ కారణంగా బ్రెయిన్‌ సహా వివిధ అవయవాల్లో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుందని.. అందుకే వారికి ఈ ప్రోటోకాల్ వర్తించదని అంటున్నారు.

స్ట్రోక్ వచ్చే అవకాశం లేనివాళ్లలోనూ బ్రెయిన్ స్ట్రోక్ 
మార్చి మధ్య నుంచి మూడు వారాల్లో 32 మంది బ్రెయిన్ స్ట్రోక్‌ పేషెంట్లను గుర్తించినట్టు న్యూరో సర్జన్ డా.మొకొ తెలిపారు. వీరిలో సగం మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. ఇందులో ఐదుగురు వ్యక్తులు 49 ఏళ్ల లోపువారేనని.. స్ట్రోక్‌కి దారితీసేంత రిస్క్ కారణాలేవీ వారిలో కనిపించకపోవడం వింతగా అనిపిస్తోందని అన్నారు. ఇదంతా చాలా అసాధారణంగా కనిపిస్తోందని అన్నారు. మౌంట్ సినయ్‌లోనే పనిచేస్తున్న మరో ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ డా.హూమన్ పూర్ తన లేట్ నైట్ షిఫ్ట్‌లలో పలు ప్రమాదకర విషయాలను గుర్తించారు. ఇటీవల 14 మంది కరోనా పేషెంట్లకు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన ఆయన.. వెంటిలేటర్ రీడింగ్స్ తాను అనుకున్నట్టు రాకపోవడం గుర్తించారు. ఊపిరితిత్తుల్లో రక్త ప్రసరణ సరిగా జరగట్లేదని గుర్తించారు.  కోవిడ్-19 పేషెంట్లలో బయటపడ్డ బ్రెయిన్ స్ట్రోక్ అనే ఈ కొత్త కోణం వైరస్ తీవ్రతను మరింత పెంచేదిగా కనిపిస్తోంది. వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు జరుపుతున్నవారికి కూడా ఇదో పెను సవాల్ గా మారనుంది.