Nasa
Nasa : రెండో ప్రయత్నంలో అంగారకుడి (మార్స్) ఉపరితలంపై రాతి నమూనాలను సేకరించడంలో పర్సివరెన్స్ రోవర్ విజయవంతమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ విషయాన్ని తెలిపింది. ఉపరితలంపై రాతి నమూనాలను సేకరించడానికి పర్సివరెన్స్ ఆగస్టులో చేసిన తొలి ప్రయత్నం విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రోవర్ చేసిన ప్రయత్నం సఫలమైనట్టు నాసా ధ్రువీకరించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ… ‘నాకు లభించింది’(I Have Got It) అని నాసా ట్వీట్ చేసింది.
పరిశోధనలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన పర్సివరెన్స్ రోవర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. అరుణ గ్రహం మీద గతంలో జీవజాలం ఉందా? అనేది తెలుసుకోడానికి ఆరు చక్రాల రోవర్‌ను నాసా పంపింది. ఈ రోవర్ రెండేళ్లపాటు అక్కడే ఉండి, రాళ్లను, నేలను డ్రిల్ చేస్తూ జీవం ఆనవాళ్ల కోసం పరిశోధన కొనసాగిస్తుంది. అయితే, ఉపరితలంపై రాతి నమూనాలను సేకరించడానికి పర్సివరెన్స్ చేసిన తొలి ప్రయత్నం విఫలమైన విషయం తెలిసిందే.
Apple Next iPhones : భారీగా పెరగనున్న ఐఫోన్ల ధరలు.. అసలు కారణం ఇదే!
ఒక ట్యూబ్ లోపల పెన్సిల్ కంటే కొంచెం మందంగా ఉన్న రాతి నమూనా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ నమూనాను సెప్టెంబర్ 1న పర్సివరెన్స్ సేకరించినప్పటికీ వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు అస్పష్టంగా ఉండటంతో రోవర్ ప్రయత్నం విజయవంతమయ్యిందా? లేదా? అనేది నాసా శాస్త్రవేత్తలకు మొదట్లో ఖచ్చితంగా తెలియదు.
తాజాగా తీసిన ఫోటో ఆధారంగా మిషన్ కంట్రోల్ కంటెంట్‌లను ధ్రువీకరించారు. నమూనాలను సేకరించి, వాటిని తదుపరి ఇమేజింగ్ కోసం ట్యూబ్‌లోకి రోవర్ బదిలీ చేసి, తర్వాత కంటైనర్‌ని సీల్ చేసింది.
Whatsappలో కొత్త ఫీచర్.. మీ కాంటాక్టులను ఇక కంట్రోల్ చేయొచ్చు!
అంగారకుడిపై క్షేమంగా దిగిన రోవర్.. శాస్త్రవేత్తలు నిర్దేశించినట్లు జెజెరో అనే సరస్సు ప్రాంతంవైపు సమీపానికి చేరింది. 3.5 బిలియన్ సంవత్సరాల కిందట అంగారకుడి ఈ సరస్సు ఏర్పడిందని సైంటిస్టులు భావిస్తున్నారు. నీరు ఉంది కాబట్టి అక్కడ జీవం కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా. ఈ నేపథ్యంలో అక్కడ నమూనాలను పరిశీలిస్తే జీవజాలం ఉనికి గురించి సమాచారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
అలాగే, అరుణగ్రహం భౌగోళిక పరిస్థితులను మరింత లోతుగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మార్స్‌పై దిగిన కాసేపటికే రోవర్ రెండు ఫొటోలను పంపింది. రోవర్‌కు అమర్చిన తక్కువ రిజల్యూషన్ కెమెరాలతో ఈ ఫొటోలను తీసింది. కెమెరా గ్లాస్ మీద దుమ్ము ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అయినా రోవర్ ముందు, వెనక భాగాలలో ఉన్న అంగారకుడి ఉపరితలం స్పష్టంగా కనిపించింది. కాగా, 2023 నాటికి అంగారకుడి నుంచి మొత్తం 30 నమూనాలను సేకరించాలని నాసా ప్రణాళిక వేసింది. జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పర్‌సివరెన్స్ రోవర్ పంపింది.