×
Ad

Nepal Currency Row: భారత్‌ను రెచ్చగొట్టేలా నేపాల్ తీరు.. కొత్త 100 రూపాయల నోటుపై ఏముందంటే..

నేపాల్ తాజా చర్యపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఏకపక్ష చర్యల వల్ల క్షేత్రస్థాయి వాస్తవాలు మారిపోవని స్పష్టం చేసింది.

Nepal Currency Row: నేపాల్ తీరు మారలేదు. భారత్ ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. తాజాగా ఆ దేశం చేసిన పని.. భారత్ కు తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించింది. నేపాల్ కొత్త 100 రూపాయల నోటు విడుదల చేసింది. ఇది వివాదాన్ని రాజేసింది. ఆ కరెన్సీ నోటుపై నేపాల్ దేశ మ్యాప్ ఉంది. ఆ మ్యాప్‌లో కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర భూభాగాలు ఉన్నాయి. అయితే, ఆ భూభాగాలు భారత్ కు చెందినవని కేంద్రం ఇప్పటికే పలుమార్లు చెప్పింది. అయినప్పటికీ నేపాల్ ఏకపక్షంగా ముందుకెళ్తోంది. నేపాల్ తాజా చర్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని మళ్ళీ రాజేసినట్లైంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ఉద్రిక్తంగా మార్చింది.

2020 మే లో కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను నేపాల్ భూభాగంగా చూపిస్తూ కొత్త మ్యాప్‌ను ఆవిష్కరించింది. అప్పుడే ఈ వివాదం మొదలైంది. ఆ సమయంలో భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది చారిత్రక ఆధారాలు లేని ఏకపక్ష చర్య అని మండిపడింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది.

నేపాల్ తాజా చర్యపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఏకపక్ష చర్యల వల్ల క్షేత్రస్థాయి వాస్తవాలు మారిపోవని స్పష్టం చేసింది. సరిహద్దు సమస్యపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికింది.

గతంలోనే నేపాల్ ఈ మ్యాప్‌ను ఆమోదించినప్పుడు భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కృత్రిమంగా భూభాగాలను విస్తరించుకునే ప్రయత్నాలను అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ, ఈ ఏడాది మే లో నేపాల్ క్యాబినెట్ ఈ కొత్త నోటు ముద్రణకు ఆమోదం తెలిపింది. తాజాగా దాన్ని చెలామణిలోకి తీసుకురావడంతో సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

Also Read: మనిషి ఆయుష్షును 150 సంవత్సరాలకు పెంచనున్న ఏఐ.. 100 ఏళ్లు దాటినా మనం యంగ్‌గా.. ఎలాగంటే?