మనిషి ఆయుష్షును 150 సంవత్సరాలకు పెంచనున్న ఏఐ.. 100 ఏళ్లు దాటినా మనం యంగ్‌గా.. ఎలాగంటే?
అసలు ఏఐకి, మనిషి జీవితకాలం పెరగడానికి సంబంధం ఏంటి? చూద్దాం..
Human Lifespan: మనిషి ఆయుష్షు దాదాపు 100 సంవత్సరాలు అని భావిస్తాం. అయినప్పటికీ ఆ వయస్సు వచ్చేవరకు బతికేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సగటు ఆయుష్షు దాదాపు 72 సంవత్సరాలు. కానీ, భవిష్యత్తులో మనుషులు 150 సంవత్సరాలు జీవిస్తే ఎలా ఉంటుంది?
ఇది నమ్మశక్యంగా లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల మనిషి ఆయుష్షు పెరుగుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అసలు ఏఐకి, మనిషి జీవితకాలం పెరగడానికి సంబంధం ఏంటి? చూద్దాం.. (Human Lifespan)
శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు?
డేటా సొసైటీ రిపోర్ట్ ప్రకారం.. మన శరీరం వయస్సు పెరగడానికి కారణం కణాల్లోని డీఎన్ఏ నెమ్మదిగా దెబ్బతినడం. ఆహారం, నీరు, విశ్రాంతి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం కొత్త కణాల సృష్టిపై దృష్టి పెడుతుంది. అంతేగానీ, దెబ్బతిన్న కణాల మరమ్మతుపై కాదు. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయం ఆధారంగా కొత్త విధానాన్ని కనుగొన్నారు. శరీరం స్వల్పంగా “షాక్” పొందేలా చేస్తారు. దీంతో కణాలు స్వయంగా మరమ్మతు ప్రారంభిస్తాయి. దీనికి వాడే ఔషధం ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉంది.
ఏఐ మనుషుల జీవితకాలాన్ని ఎలా పెంచుతుంది?
గతంలో డీఎన్ఏ మార్పు కోసం క్రిస్పర్ (CRISPR) టెక్నాలజీ ఉపయోగించారు. క్రిస్పర్ అంటే కణాల్లో డీఎన్ఏని లక్ష్యంగా చేసుకుని మార్పులు చేసే బయోటెక్ విధానం. అయితే, అది ఒక్క సమయానికి ఒక్క చిత్రాన్ని మాత్రమే చూపేది. నిజ జీవితంలో జీన్ల (జన్యువుల) ప్రవర్తన ఆహారం, ఒత్తిడి, వాతావరణం ఆధారంగా నిరంతరం మారుతుంది.
ఇక్కడే ఏఐ అద్భుతం చేస్తోంది. ఏఐ జీన్ల కార్యకలాపాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది, సరైన సమయంలో సరైన చికిత్స సూచిస్తుంది. దీంతో చికిత్స ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా, కచ్చితమైన రీతిలో జరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి.
భవిష్యత్తులో 60-70 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 20-25 సంవత్సరాల వాళ్లలా తెలివిగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం యువతలాగే ఉంటాయి. మనుషులు ఎక్కువకాలం జీవించడమే కాకుండా ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారు.
డేటా సొసైటీ సహవ్యవస్థాపకుడు డిమిట్రీ అడ్లర్ దీనిపై మాట్లాడుతూ.. “ఏఐ మనల్ని సూపర్‌హీరోగా మార్చదు, కానీ ఆరోగ్యవంతుడిగా, శక్తిమంతుడిగా మారుస్తుంది” అని అన్నారు. త్వరలోనే 100-120 సంవత్సరాల వయస్సులో కూడా యువకుల్లా క్రీడలు ఆడుతున్న మనుషులను చూస్తామని తెలిపారు.
