భారత్-పాక్‌లకు మీడియేటర్‌గా నేపాల్

ఇండియా-పాకిస్తాన్ ల మధ్య మీడియేటర్ గా ఎవ్వరు అవసర్లేదని అంటున్నా మేం ఉన్నామంటూ సిద్ధమైపోతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్సాహం చూపించడంతో భారత ప్రధాని అవసర్లేదని కొట్టిపారేశారు. మళ్లీ ఇప్పుడు నేపాల్ ముందుకొస్తుంది. 

పాక్‌‌కు భారత్‌తో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేస్తామని నేపాల్‌ సంసిద్ధత వ్యక్తంచేసింది. ఇరు దేశాల మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉందని పేర్కొంది. ‘ఏ సమస్యనైనా చర్చలు అనే సరైన మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చు. విభేదాలు ఉండొచ్చు కానీ చర్చల ద్వారా పరిష్కారం వెతుక్కోవాలి. అవసరమైతే.. దీని కోసం మధ్యవర్తిత్వం వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని నేపాల్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఇరు దేశాలు చర్చలకు కూర్చుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది. సార్క్‌ (ఎస్‌ఏఏఆర్‌సీ) ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందంటూ నేపాల్‌ వర్గాలు వెల్లడించాయి. 2014లో చివరిసారిగా కాఠ్మాండూలో సార్క్‌ సమావేశాలు ముగిశాయి. దీనికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. అనంతరం 2016లో సార్క్‌ సదస్సును ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేయగా భారత్‌ వెళ్లేందుకు నిరాకరించింది.