Nepal PM KP Sharma Oli Resigns
Nepal PM KP Sharma Oli Resigns : నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి దిగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా నిషేధంపై ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముగ్గురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ నిరసనలు తగ్గుముఖం పట్టలేదు. ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేయాలంటూ ఆ దేశంలోని యువత ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ క్రమంలో రాజధానిలోని ఓలి అధికారిక నివాసాన్ని నిరసనకారులు ముట్టడించారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతేకాదు.. ఇంటికి నిప్పుపెట్టారు.
🔥 Breaking: Protesters set fire to PM KP Oli’s residence in Balkot amid escalating unrest. 😲🚨#NepalProtests #BreakingNepal #KPOli #Balkot #NepalCrisis #YouthMovement #NepalNews pic.twitter.com/hnVlx27Us8
— TikTube X News (@TikTubeXNews) September 9, 2025
ప్రధాని ఓలీ నివాసంతోపాటు సీనియర్ రాజకీయ నేతల ఇళ్లు, కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇళ్లపై దాడులు చేస్తున్నారు. దీంతో నేపాల్ లో రాజకీయ సంక్షోభంతోపాటు.. నిరసనల ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సైన్యం సూచన మేరకు ఆయన ప్రధాని పదవికి తన రాజీనామాను ప్రకటించినట్లు తెలిసింది.
యువత నిరసనల నేపథ్యంలో నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ తో ప్రధాని కేపీ శర్మ ఓలీ మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు, ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన నేపాల్ ఆర్మీ చీఫ్ ను అడిగినట్లు తెలిసింది.
అయితే, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని, ఆ తరువాత ఈ ఘర్షణలను అదుపు చేసేందుకు సైన్యం రంగంలోకి దిగుతుందని ఓలీకి ఆర్మీ చీఫ్ సూచించినట్లు తెలిసింది. ఈ తరుణంలో ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. రాజీనామా అనంతరం కేపీ శర్మ ఓలీని నేపాల్ ఆర్మీ సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఓలీ రాజీనామాతో నేపాల్ ఆ దేశ ఆర్మీ పాలనలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశంలోని ముఖ్యనేతలను ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.