Nepal President Resign: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా నేపాల్ లో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ప్రధాని, పలువురు మంత్రులు రాజీనామా చేసేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు. అటు ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రిజైన్ చేయడంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది.
సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిచ్చు రాజేసింది. యువత ఆందోళన బాట పెట్టింది. నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించారు. అదే సమయంలో రాజకీయ వారసత్వాలపై నిరసనలూ మొదలయ్యాయి. వీటిని నెపోకిడ్ మూమెంట్‌గా పిలుస్తున్నారు. సంపన్న వర్గాల, రాజకీయ నాయకుల పిల్లలు అవినీతి సొమ్ముతో వచ్చే ఫలాలను అనుభవిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు పార్లమెంటులోకి చొచ్చుకెళ్లారు. భవనానికి నిప్పు పెట్టారు. అటు భక్తాపుర్‌లోని కేపీ శర్మ ఓలీ వ్యక్తిగత నివాసానికి కూడా ఆందోళనకారులు నిప్పంటించారు. అది మంటల్లో కాలిపోతుంటే చూస్తూ డ్యాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.