Kim Jong Un
North Korea: విదేశీ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూస్తే కూడా ఉత్తర కొరియాలో ప్రజలకు మరణశిక్షలు విధిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ ధోరణి మరింత పెరిగిందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో తెలిపింది.
ఉత్తరకొరియాలో విదేశీ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూడడమే కాదు, షేర్ చేసినా తప్పే. ప్రజల స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ధోరణి మరింతగా పెరిగింది. (North Korea)
గత దశాబ్దంలో ఉత్తర కొరియా ప్రభుత్వం తమ పౌరుల జీవితంలోని ప్రతి అంశంపై నియంత్రణ పెంచిందని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కార్యాలయం గుర్తించింది. ప్రపంచంలో ఇంతటి ఆంక్షలను ఎదుర్కొనే ప్రజలు ఏ దేశంలోనూ లేరని చెప్పింది. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పర్యవేక్షణ మరింత పెరిగిందని తెలిపింది.
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ఉన్నతాధికారి వోల్కర్ టర్క్ మాట్లాడుతూ.. ఈ పరిస్థితి కొనసాగితే ఉత్తర కొరియా ప్రజలు ఇప్పటివరకు అనుభవించిన బాధ, క్రూరమైన నిర్బంధం, వారిలో భయం మరింత పెరిగిపోతాయని అన్నారు.
Also Read: మహిళలకు గుడ్‌న్యూస్.. ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లు.. దరఖాస్తుల స్వీకరణ
గత 10 ఏళ్లలో ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని ఇతర దేశాలను వెళ్లిపోయిన 300 మందికిపైగా వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి, దాని ఆధారంగా ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను రూపొందించింది. మరణశిక్ష ఎదుర్కొంటున్న వారు పెరిగిపోయారని తెలిపింది.
ఉత్తరకొరియాలో 2015 నుంచి ఇప్పటివరకు 6 కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. విదేశీ సినిమాలు, టీవీ డ్రామాలు చూడటం, షేర్ చేయడం వంటి వాటిపై నిషేధం కూడా వీటిలో ఉంది. ప్రజలకు ఇతర దేశాల నుంచి సమాచారం అందకుండా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రయత్నిస్తున్నారు.
విదేశీ కంటెంట్ షేర్ చేసేవారిపై 2020 నుంచి మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అటువంటివారికి విధిస్తున్న మరణశిక్షల సంఖ్య పెరిగిపోయింది. ఈ మరణశిక్షలను మన దేశంలోలా ఉరిశిక్ష విధానంలో అమలు చేయరు. నేరస్తులను ప్రజల ముందు సైనికులు కాల్చి చంపుతారు.
కాంగ్ గ్యూరి అనే మహిళ ఉత్తరకొరియా నుంచి 2023లో తప్పించుకుని పారిపోయారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ముగ్గురు స్నేహితులు దక్షిణ కొరియాకు చెందిన కంటెంట్‌తో పట్టుబట్టారని, వారికి మరణశిక్ష విధించారని చెప్పారు.
వారిలో తన స్నేహితుడు ఒకరిని 23 ఏళ్లని, అతడిని మాదకద్రవ్య నేరస్తులతో కలిపి విచారించారని తెలిపారు. విదేశీ కంటెంట్‌తో పట్టుబడడం వంటి నేరాన్ని డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ నేరంతో సమానంగా పరిగణిస్తున్నారని ఆమె అన్నారు. 2020 నుంచి ప్రజల్లో భయం మరింత పెరగిందని చెప్పారు.