కోమాలో ఉత్తర కొరియా నియంత కిమ్.. సోదరికి బాధ్యతలు?

  • Publish Date - August 24, 2020 / 09:50 AM IST

ఉత్తర కొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ ఆరోగ్యం గురించి వరుసగా ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కిమ్ కోమాలోకి వెళ్లినట్లుగా.. అతని సోదరి కిమ్ యో-జోంగ్ జాతీయ మరియు అంతర్జాతీయ వ్యవహారాలను నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నట్లుగా దక్షిణ కొరియా అధికారి వెల్లడించారు.



దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్ మాజీ మిత్రుడు చాంగ్ సాంగ్-మిన్ ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ కోమాలోకి వెళ్లడం గురించి ప్రకటించారు. చాంగ్ సాంగ్-మిన్ ప్రకారం, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నాడు. అంతేకాదు.. అతని సోదరి కిమ్ యో-జోంగ్‌కు అమెరికా మరియు దక్షిణ కొరియాతో సంబంధాలను నిర్వహించే బాధ్యతలను అధికారికంగా ఇచ్చినట్లుగా ఆయన చెబుతున్నారు.

అంతేకాదు కిమ్ కోమాలో ఉండడంతో ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నారని, కిమ్ కోమాలోకి వెళ్లిన విషయాన్ని తమ గూఢచర్య వర్గాలు తెలిపాయని స్పష్టం చేశారు. కిమ్ కోమాలో ఉన్నాడని, కానీ ఆయన మరణించలేదని చాంగ్ తెలిపారు. ఈ ఏడాది కిమ్ బయట చాలా తక్కువసార్లు కనిపించారని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని చెప్పుకొచ్చారు. ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిమ్ యో జోంగ్ సిద్ధంగా ఉన్నట్టు చాంగ్ తెలిపారు.



ఇదిలా ఉంటే కిమ్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్టు గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత కిమ్ ఓసారి బహిరంగంగా కనిపించడంతో ఆ వార్తలకు చెక్ పడింది. ఆరోగ్యం క్షీణించిందనే ఊహాగానాల మధ్య ఉత్తర కొరియా నియంత.. ఏప్రిల్ 11 న జరిగిన వర్కర్స్ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి చివరిసారిగా అధ్యక్షత వహించారు. అయితే, ఇటీవలి నెలల్లో ఉత్తర కొరియా విడుదల చేసిన కిమ్ చిత్రాలన్నీ నకిలీవని చాంగ్ చెబుతున్నారు.