కరోనా వెనుక అసలు కథ…40ఏళ్ల క్రితమే వూహాన్ వైరస్ గురించి ఓ నవలలో ప్రస్తావన

కరోనా వైరస్(కోవిడ్-19) దెబ్బకి చైనాలో ఇప్పటివరకు 1700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది అధికార లెక్కే. అనధికరికంగా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం చైనాలోని వూహాన్ సిటీలో మొదటిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పటివరకు 26దేశాలకు విస్తరించింది.

అయితే ఈ వూహాన్ వైరస్ గురించి 40ఏళ్ల క్రితమే ఓ ఫిక్షన్(కల్పిత)బుక్ ఊహించినట్లు మీకు తెలుసా?. 1981 లో డీన్ కూంట్జ్ రాసిన థ్రిల్లర్ నవల…. “ది ఐస్ ఆఫ్ డార్క్ నెస్” వుహాన్ -400 అనే వైరస్ గురించి ప్రస్తావించింది. ఈ నవలలో, ప్రయోగశాలలో వైరస్ ఆయుధంగా సృష్టించబడింది. దారెన్ ప్లైమౌత్ అనే ఓ నెటిజన్..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. సంబంధిత బుక్ కవర్ ఫొటోను,బుక్ లో వైరస్ వూహాన్-400గురించి ప్రస్తావించిన పేజీ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు.

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు దీనిపై భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదని క్లియర్ గా కనిపిస్తోందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా,మరికొందరు అసాధారణమైన యాదృచ్చికంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్ర సమాచార,ప్రసారశాఖ మంత్రి మనీష్ తివారీ కూడా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా వైరస్ అనేది వూహాన్-400 పేరుతో చైనా డెవలప్ చేసిన బయోలాజికల్ ఆయుధమా?ఈ బుక్ 1981లో పబ్లిష్ అయింది. దీని సారాంశం చదవండి అంటూ బుక్ ఫొటోలను షేర్ చేస్తూ మనీష్ తివారీ ట్వీట్ చేశాడు.

మరోవైపు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇప్పటివరకు ఏ సైంటిస్టు కనిపెట్టలేదు. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ ను అరికట్టలేక చైనా తలలు పట్టుకుంటోంది. చైనాలో 70వేల మంది కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. వారందరినీ హాస్పిటల్స్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే రోజుకి 100-15మంది చొప్పును పిట్టలు రాలినట్లు పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు.

మరోవైపు చైనాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలను రోడ్డపైకి రానివ్వకుండా ఆంక్షలు విధించారు స్థానిక అధికారులు. కరెన్సీ నోట్ల నుంచి వైరస్ వ్యాపిస్తుందన్న హెల్త్ అధికారుల హెచ్చరికలతో కరెన్సీ నోట్లపై కూడా నిషేధాజ్ణలు విధించారు. పాత కరెన్సీని చలామణిలోకి రాకుండా కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తెచ్చారు.సాధ్యమైనంతవరకు అందరూ డిజిటల్ చెల్లింపులు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ప్రజలను ఆదేశించింది.