సౌదీ అరేబియాకు పాకిస్థాన్ నుంచి అతి భారీ సంఖ్యలో బిచ్చగాళ్లు వెళ్తున్నారు. సాధారణంగా పాకిస్థాన్ ఐఎంఎఫ్‌తో పాటు చైనా వంటి దేశాల నుంచి విపరీతంగా అప్పులు తెచ్చుకుంటోంది. పాకిస్థాన్‌లో పేదరికం కారణంగా ప్రజల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. దీంతో పాకిస్థాన్‌లో బిచ్చగాళ్లు కూడా ఉండలేకపోతున్నారు.
అడుక్కు తిని బతకడానికి సౌదీ అరేబియాకు వెళ్తున్నారు. దీంతో పాకిస్థాన్ నుంచి వచ్చిన బిచ్చగాళ్లను తిరిగి పంపించే చర్యలను చేపట్టింది సౌదీ అరేబియా. ఇలా 5,033 మందిని పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా బలవంతంగా పంపించేసింది. అలాగే, మిగతా పలు దేశాల నుంచి వచ్చి సౌదీలో అడుక్కుంటున్న 369 మందిని కూడా పంపించింది.
సౌదీ నుంచి పాకిస్థాన్‌కు తిరిగి వచ్చిన వారి వివరాలను పాక్ మంత్రి మొహసిన్ నక్వీ తాజాగా నేషనల్ అసెంబ్లీలో వివరించారు. 2024 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్ మిత్ర దేశాలు పంపించేయగా వచ్చేసిన బిచ్చగాళ్ల సంఖ్య మొత్తం కలిపి 5,402గా ఉందని చెప్పారు.
సౌదీ అరేబియా, మలేసియా, ఒమన్, ఇరాక్, ఖతార్, యూఏఈ వంటి దేశాలు పాకిస్థాన్ యాచకులను తిరిగి పంపించేశాయి. తిరి పాక్ వచ్చిన యాచకుల్లో సింధికి చెందినవారు 2,795, పంజాబ్‌కి చెందిన వారు 1,437, కేపీకి చెందిన వారు 1,002, బలోచిస్థాన్‌కు చెందిన వారు 125, పీవోకేకు చెందిన వారు 33 మంది ఉన్నారని వివరించారు.
పాకిస్థాన్‌లో యాచన సమస్యగా మారిందని కొన్ని వారాల క్రితం ఆ దేశ మంత్రి ఖవాజా ఆసీఫ్ కూడా చెప్పారు. ఈ కారణంగా ఇతర దేశాలు తమ దేశానికి చెందిన వారికి వీసాలు ఇవ్వడానికి వెనకాడుతున్నట్లు తెలిపారు. పాకిస్థాన్‌లో సుమారు 2 కోట్ల మంది బిచ్చగాళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. యాచకుల నెలసరి ఆదాయం రూ.4,200 కోట్ల (పాకిస్థాన్ రూపాయల్లో) అని చెప్పారు.