ఇండియాకు ట్రంప్‌ భారీ దెబ్బ.. ఆపిల్‌ కంపెనీ భారత్‌కు రాకుండా.. ఇండియాలో ఆపిల్‌ విస్తరణకు ఇక బ్రేక్?

దీంతో, భారత్‌లో ఐఫోన్‌లు భారీగా తయారవుతాయని అందరూ భావించారు.

ఇండియాకు ట్రంప్‌ భారీ దెబ్బ.. ఆపిల్‌ కంపెనీ భారత్‌కు రాకుండా.. ఇండియాలో ఆపిల్‌ విస్తరణకు ఇక బ్రేక్?

Updated On : May 15, 2025 / 6:30 PM IST

అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఇకపై అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని ఆ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ కొన్ని వారాల క్రితం తెలిపిన విషయం తెలిసిందే. భారత్‌కు ఆపిల్‌ తయారీ ప్లాంట్లు తరలివస్తాయని అందరూ భావించారు. అయితే, దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మోకాలడ్డుతున్నారు.

తాజాగా, ట్రంప్‌ భారత్‌లో ఐఫోన్ల ఉత్పత్తిపై మాట్లాడుతూ.. తనకు, టిమ్‌ కుక్‌తో మధ్య చిన్న సమస్య ఎదురైందని అన్నారు. టిమ్ కుక్‌ ఇండియాలో తయారీ ఫ్యాక్టరీల నిర్మాణాలు చేపట్టారని, ఇది తనకు ఇష్టం లేదని చెప్పానని స్పష్టం చేశారు.

దీంతో అమెరికాలోనే ఉత్పత్తి పెంచేందుకు ఆ సంస్థ ఒప్పుకుందని ట్రంప్ అన్నారు. టిమ్‌ కుక్‌తో డొనాల్డ్ ట్రంప్‌ నిన్న ఖతార్‌లో జరిగిన ఓ సమావేశంలో చర్చించారు. అమెరికా ఉత్పత్తులపై అనేక దేశాలు అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్నాయని, అందులో ఇండియా ఒకటని ట్రంప్ ఈ సమావేశంలో అన్నారు.

Also Read: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్… పెరిగిన ఛార్జీలు.. టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

కాగా, ఇటీవల చైనా, అమెరికా పరస్పరం భారీగా టారిఫ్‌లు విధించుకుంటూ వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆపిల్‌ అమెరికాకు అవసరమైన ఐఫోన్లను ఇండియాలో తయారు చేయించి ఎగుమతి చేయించాలని ప్లాన్లు వేసుకుంది. ఇప్పటికే ఇండియాలో టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్‌ కంపెనీలు ఐఫోన్ల అసెంబ్లింగ్‌ చేస్తున్నాయి.

ఆపిల్, దాని సప్లయర్లు తమ తయారీని చైనా నుంచి తరలిస్తున్నాయి. దీంతో, భారత్‌లో ఐఫోన్‌లు భారీగా తయారవుతాయని అందరూ భావించారు. టాటా, ఫాక్స్‌కాన్ దక్షిణ భారత్‌లో మరిన్ని ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నాయి. మరిన్ని ఐఫోన్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నాయి. ఈ సమయంలో ట్రంప్ చేసిన కామెంట్లు భారత్‌కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి.