×
Ad

Pakistan-Afghanistan clashes: పాకిస్థాన్‌ను తిట్టిన ట్రంప్‌.. వాళ్లే కారణమంటూ కామెంట్స్‌

పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

Pakistan-Afghanistan clashes:  “ఐ లవ్ పాకిస్థాన్” అంటూ కొన్ని నెలల క్రితం వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇప్పుడు అసలు తత్వం బోధపడినట్లుంది. పాకిస్థాన్‌పై ఇప్పుడు ట్రంప్ మండిపడుతున్నారు.

పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ దీనికి పాకిస్థానే కారణమని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో లంచ్‌ సందర్భంగా ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ.. “నాకు తెలుసు, పాకిస్థాన్ దాడి చేసింది. అవసరమైతే దీన్ని నేను సులువుగా పరిష్కరించగలను. యుద్ధాలను ఆపడమంటే నాకు ఇష్టం” అని అన్నారు. తాను కోట్లాది మంది ప్రాణాలు కాపాడానని, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతానని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Video: కేటీఆర్‌ వద్దకు వెళ్లి కబ్జా సమస్యలు చెప్పుకున్న మొగులయ్య.. కేటీఆర్ వెంటనే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి.. 

అఫ్ఘానిస్థాన్‌తో పాకిస్థాన్ చర్చలు

అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ శుక్రవారం వైమానిక దాడులు జరిపి దాదాపు 10 మంది ప్రాణాలు తీసింది. ఘర్షణలపై అఫ్ఘాన్‌లోని తాలిబాన్‌లతో ఖతార్‌లో చర్చలు జరపనున్నట్లు పాకిస్థాన్ ఉన్నతాధికారులు ప్రకటించారు. “పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్ జనరల్ ఆసిమ్ మాలిక్ ఇవాళ దోహాకు బయలుదేరి తాలిబాన్‌తో చర్చలు జరపనున్నారు” అని పాకిస్థాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది.

“అఫ్ఘాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్ నేతృత్వంలోని ఇస్లామిక్ ఎమిరేట్ బృందం ఇవాళ దోహాకు బయలుదేరింది” అని అఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మరోవైపు, పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పక్తికా ప్రావిన్స్‌లోని మూడు ప్రాంతాలపై బాంబులు వేసిందని ఒక తాలిబాన్ అధికారి తెలిపారు. అఫ్ఘానిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం చేశారు.