Pakistan Afghanistan
Pakistan Afghanistan Tensions : అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో గురువారం రాత్రి భారీ పేలుళ్లు సంభవించాయి. తూర్పు కాబూల్‌లోని తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా దాడులు జరిగినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు పాక్ రక్షణ విశ్లేషణ సంస్థల కథనాలు వెల్లడిస్తున్నాయి. కానీ, ఈ దాడులపై పాకిస్థాన్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
పాకిస్థాన్ వైమానిక దాడిలో అనేక పౌర నిర్మాణాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. నూర్ వలీ మెహ్సుద్ లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడుల్లో మెహ్సూద్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. దాడి తరువాత మెహ్సూద్ తాను సురక్షితంగా ఉన్నానని, పాకిస్థాన్ లో ఉన్నానని పేర్కొంటూ వాయిస్ మెస్సేజ్ పంపినట్లు తెలిసింది. అయితే, అతని కుమారుడు దాడిలో మరణించాడని సమాచారం. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని బహిరంగంగా ఆరోపించిన 48గంటల్లో ఈ దాడి జరిగింది.
2021లో తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత మొదటిసారిగా కాబూల్ పై దాడి చేయటానికి పాకిస్థాన్ సముఖంగా ఉందని వర్గాలు తెలిపాయి. తాలిబన్ల పరిమిత వైమానిక రక్షణ సామర్థ్యాలు, మాజీ ఆఫ్గన్ వైమానిక దళం లేకపోవడం దృష్ట్యా ఈ తరహా దాడి బాహ్య సాంకేతిక సహాయంతో పాకిస్థాన్‌కు చెందిన జెట్‌లతో కూడిన దాడి అని, ఇది చాలా రెచ్చగొట్టేదిగా ఉందని పేర్కొంటున్నారు. తాలిబన్లకు దగ్గరగా ఉన్న వర్గాలు దీనిని అప్ఘన్ సార్వభౌమత్యాన్ని ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నాయి.
టీటీపీ చీఫ్ లక్ష్యంగా దాడులు చేయడాన్ని దాని అనుబంధ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతీకార దాడులకు సిద్ధంగా ఉండాలని టీటీపీ మద్దతుదారులకు పిలుపునిచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
అఫ్ఘనిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాకి ఎనిమిది రోజుల పర్యటన నిమిత్తం భారతదేశంలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ పర్యటనలో ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో విడివిడిగా చర్చలు జరపనున్నారు.
ఇదిలాఉంటే.. మెహ్సూద్ కుటుంబం లక్ష్యంగా జరిగిన దాడి తరువాత టీటీపీలో పెద్ద అంతర్గత సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కాబూల్ అనుకూల, పాకిస్థాన్ అనుకూల వర్గాలుగా విడిపోయాయి. అంతర్గత ఘర్షణలు కునార్, నంగర్హార్, పాక్టికా సరిహద్దు ప్రాంతాలకు విస్తరించాయి. పాకిస్థాన్, తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం జరిగిన ఘటన రెండు దేశాల మధ్య తీవ్ర అంతరాన్ని పెంచుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.