మోడీకి దారి ఇవ్వం..భారత్ విజ్ణప్తిని మరోసారి తిరస్కరించిన పాక్

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు మరోసారి పాక్ నిరాకరించింది. భారత ప్రధాని తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు వీల్లేదని భారత్ చేసిన విజ్ణప్తిని తిరస్కరించింది. ఈ మేరకు తాము నిర్ణయం తీసుకున్నట్లు   ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి మహమ్మద్ ఖురేషి ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం(అక్టోబర్-28,2019)సౌదీ అరేబియా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇంటర్నేషల్ బిజినెస్ ఫోరంకు ప్రధాని పాల్గొంటారు. సౌదీ అగ్రనాయకత్వంతో చర్చలు జరపుతారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయిసేన మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో  పాక్ తమ గగనతలాన్ని మూసివేసింది. అయితే ఆ తర్వాత కొన్నిరోజులకు భారత విమానాలు తప్ప మిగతా అన్ని దేశాల విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేలా ఆదేశాలు జారీ చేసింది. భారత్ మాత్రం తమ గగనతలం వినియోగించడానికి వీల్లేదని పాక్ ఆంక్షలు విధించింది.

సెప్టెంబర్ లో మోడీ అమెరికా పర్యటన సందర్భంగా గగనతలాన్ని ఓపెన్ చేయాలని భారత్ చేసిన విజ్ణప్తిని పాక్ తిరస్కరించిన విసయం తెలిసిందే. అదే నెలలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఐస్ లాండ్ వెళ్లేందుకు భారత్ పాక్ కు తమ గగనతలానని ఓపెన్ చేయాలని కోరగా అప్పుడు కూడా భారత విజ్ణప్తిని పాక్ తిరస్కరించింది. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370రద్దు చేసినప్పటినుంచి భారత్ పై పాక్ విషం చిమ్ముతున్న విసయం తెలిసిందే.