Pahalgam Terror Attack
Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్ ప్రాంతం పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ బలంగా నమ్ముతుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలుసైతం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా భారత్ దౌత్య సంబంధాలను తగ్గించింది. కీలకమైన సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ వీసాలను రద్దు చేసింది. భారత్ లోని పాకిస్థానీయులు వారంరోజుల్లో భారత్ విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే, భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఆ దేశంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. భారత్ కీలక నిర్ణయాల తర్వాత ఏప్రిల్ 24న పాకిస్థాన్ స్టాక్ ఎక్సైజ్ రెండువేల పాయింట్లు కుప్పకూలింది.
భారత్ తో ఉద్రిక్తతలు పాకిస్థాన్ కు భారీ దెబ్బ..
భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన తరువాత పాకిస్థాన్ స్టాక్ ఎక్సైజ్ నష్టాల్లోకి వెళ్లిపోయింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాల్లోనే పీఎస్ఎక్స్ కీలక సూచీ కేఎస్ఈ-100 ఏకంగా 2.12 శాతం (2,485.85 పాయింట్లు) పతనమై 114,740.29 వద్దకు చేరింది. అంతకుముందు బుధవారం కూడా మార్కెట్ భారీగా నష్టపోయింది. దీంతో రెండు రోజుల్లోనే సూచీ దాదాపు 2,500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ నష్టాల పరంపర కొనసాగుతుండగానే ఉంది. ఇప్పటికే ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వృద్ధి రేటు అంచనాలను ఈ ఆర్థిక సంవత్సరానికి 2.6 శాతానికి తగ్గించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ వరుస పరిణామాలు పెట్టుబడిదారులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) కూడా పాకిస్తాన్ 2025 జీడీపీ వృద్ధి అంచనాను డిసెంబర్ 2024లో అంచనా వేసిన 3శాతం నుండి 2.5శాతంకి తగ్గించింది.
సింధూ ఒప్పందం రద్దుతో పాక్ విలవిల..
పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ పట్ల భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ కు పెద్ద దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని, తద్వారా పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరించారు. వ్యవసాయం రంగం పాకిస్థాన్ జీడీపీకి 22.7శాతం తోడ్పడుతుందని, 37.4శాతం శ్రామిక శక్తిని ఉపాధి కల్పిస్తుందని 2022-23 ఆర్థిక సర్వే తెలిపింది. నివేదికల ప్రకారం.. సింధు జలాల ద్వారా పాకిస్థాన్ లోని 90శాతం ఆహార పంటలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం భారత్ నిర్ణయంతో ఆ దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో పాకిస్థాన్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ పెనుముప్పు నుంచి ఎలా బయటపడాలనే విషయంపై ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ, ఆర్థిక సంక్షోభం..
పాకిస్థాన్ అత్యంత కష్టాల్లోకి కూరుకుపోతుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష, బలుచిస్తాన్ లో తిరుగుబాటు కారణంగా ఆ దేశంలో ఇప్పటికే రాజకీయ గందరగోళం నెలకొంది. మరోవైపు.. పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గణనీయంగా పడిపోయాయి. పాకిస్థాన్ టీ తేయాకును దిగుమతి చేసుకోవటానికి అప్పు చేయాల్సి రావడంతో ఇటీవల మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ప్రజలకు టీ తాగడాన్ని తగ్గించుకోవాలని కోరాడు. ఈ ప్రకటన పాకిస్థాన్ విదేశీ నిల్వల అస్థిర పరిస్థితిని హైలెట్ చేసింది. మే 2023లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 38.50శాతంకి పెరగడంతో ఆదేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. వృద్ధి ప్రతికూలంగా మారడం, నిల్వలు కేవలం రెండు వారాల నియంత్రిత దిగుమతులకు తగ్గడం, వడ్డీ రేట్లు 22శాతంకి పెరగడం వంటివి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. దాని నిల్వలు కేవలం 3.7 బిలియన్లు డాలర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ 22 బిలియన్ల డాలర్లు బాహ్య రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇందులో దాదాపు 13 బిలియన్ డాలర్లు ద్వైపాక్షిక డిపాజిట్లు ఉన్నాయని ఫించ్ (క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) తెలిపింది. పెద్ద మెచ్యూరిటీలు, రుణదాతల ప్రస్తుత ఎక్స్‌పోజర్‌లను పరిగణనలోకి తీసుకుంటే తగినంత బాహ్య ఫైనాన్సింగ్‌ను పొందడం పాకిస్థాన్ కు సవాలుగా మారింది.
పాక్ ఇప్పుడేం చేస్తుంది..
భారత్ తీసుకున్న ఐదు అంశాలపై పాకిస్థాన్ పాలకవర్గంలో ఆందోళన మొదలైంది. గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. భారతదేశం తొందరపడి తీసుకున్న నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయ పడినట్లు తెలిసింది. అదే సమయంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో ఆందోళనతో ఉన్న పాకిస్థాన్ ఎలాంటి ప్రతిచర్య తీసుకోవాలనే అంశంపై సమావేశంలో చర్చించింది. మొత్తానికి భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నప్పటికీ.. పైకి మాత్రం పాక్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.