Pakistan Train Hijack: 155 మంది ప్రయాణికులను రక్షించిన భద్రతా బలగాలు.. 27 మంది ఉగ్రవాదులు హతం

భద్రతా బలగాలు రక్షించిన 155 మందిలో వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

పాకిస్థాన్‌లో బలోచ్‌ మిలిటెంట్లు రైలును హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌లో బందీగా ఉన్న వారికి కాపాడేందుకు పాకిస్థాన్‌ భద్రతా బలగాలు పోరాడుతున్నాయి. ఆ రూలు బలోచిస్థాన్‌ ప్రావిన్సులోని క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న సమయంలో దాన్ని మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఈ ట్రైను మార్గంలో 17 సొరంగాలు ఉన్నాయి. ఎనిమిదో సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి ఆ రైలును హైజాక్‌ చేశారు.

ఇప్పటివరకు భద్రతా బలగాలు దాదాపు 155 మంది ప్రయాణికులను రక్షించాయి. బలోచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు ఇప్పటివరకు 27 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయని అన్నారు. బలోచ్ మిలిటెంట్ల వద్ద ప్రస్తుతం 214 మంది బందీలుగా ఉన్నారు.

Also Read: పసిడి కొంటున్నారా? భారత్‌లో బంగారం ధరలు తగ్గుతుంటే.. అక్కడ మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి?  

భద్రతా బలగాలు రక్షించిన 155 మందిలో వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. గాయపడిన 37 మందిని వైద్య చికిత్స కోసం తరలించారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి చేసిన మిలిటెంట్లు అఫ్ఘానిస్థాన్‌లోని వారి మద్దతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నారని అధికారులు చెబుతున్నారు.

కొంతమంది ప్రయాణికులకు దగ్గరగా మిలిటెంట్లు ఆత్మాహుతి బాంబర్లను ఉంచారని అన్నారు. ఆత్మాహుతి బాంబర్లు పేలుడు దుస్తులు ధరించారని భద్రతా వర్గాలు చెప్పాయి. భద్రతా బలగాల దాడులతో ఓడిపోతామని భావించి మిలిటెంట్లు అమాయక ప్రజలను తమకు మానవ కవచాలుగా ఉపయోగిస్తున్నారని అన్నాయి. మిలిటెంట్ల బందీలో మహిళలు, పిల్లలు కూడా ఉండడంతో ఈ ఆపరేషన్‌ను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.

మొత్తం ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి నిర్ధారణ లేదు. నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఈ దాడికి బాధ్యత వహించింది. పెద్ద సంఖ్యలో ప్రజలను బందీలుగా తీసుకున్నట్లు పేర్కొంది. భద్రతా దళాలు వెనక్కు వెళ్లకపోతే అందరినీ చంపేస్తామని మిలిటెంట్లు బెదిరిస్తున్నారు. తాము మహిళలు, పిల్లలను విడిచిపెట్టినట్లు బీఎల్‌ఏ అంటోంది. కానీ, వారిని వారికి రక్షణ కవచాలుగా మిలిటెంట్లు వాడుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.