Gold price: పసిడి కొంటున్నారా? బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?  

అక్కడ బంగారం ధరలు పెరగడానికిగల కారణాలపై ఎల్‌కేపీ సెక్యూరిటీస్, కమోడిటీ అండ్ కరెన్సీ, వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ.. ఈ విషయాన్నే స్పష్టం చేశారు.

Gold price: పసిడి కొంటున్నారా? బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?  

Updated On : March 12, 2025 / 2:13 PM IST

భారత్‌లో ఇవాళ పసిడి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగానూ పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఇవాళ ఎమ్‌సీఎక్స్‌ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్) బంగారం ధర మరింత పెరిగి 10 గ్రాములకు రూ.86,000 మార్కును దాటింది.

ఎమ్‌సీఎక్స్‌ పసిడి ధర ఇవాళ ఉదయం నాటికి 10 గ్రాములకు రూ.86,139 వద్ద ప్రారంభమై ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ.86,271ని తాకింది. నిన్ను ముగింపు సమయానికి రూ.86,152గా ఈ ధర ఉంది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు $2,918 వద్ద ఉన్నాయి.

Also Read: మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్.. దేశంలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడే కొంటే..

బంగారం ధరలు ఎందుకు పెరిగాయి?
ప్రస్తుతం ఏ విధంగా చూసినా అమెరికా డాలర్‌లో స్ట్రాంగ్‌ మూవ్‌మెంట్‌ లేదు. డాలర్‌ స్థిరంగా ఉన్నప్పటికీ మరింత బలపడే పరిస్థితులు కనపడడం లేదు. అదే సమయంలో అమెరికాలో అధిక సుంకాలు (దిగుమతి చేసుకున్న వస్తువులపై పన్నులు) గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి.

వాణిజ్యం ఖర్చులను ఈ పరిస్థితులు ప్రభావితం చేస్తున్నాయి. ఈ కారణాలు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితిని సృష్టిస్తాయి. తరువాత ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉండడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.

గ్లోబల్‌ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరగడానికిగల కారణాలపై ఎల్‌కేపీ సెక్యూరిటీస్, కమోడిటీ అండ్ కరెన్సీ, వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ.. ఈ విషయాన్నే స్పష్టం చేశారు. బంగారాన్ని పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా చూస్తుండడంతో కొనుగోళ్లు మాత్రం బాగానే ఉన్నాయని అన్నారు. ఈటీఎఫ్‌ ఇన్‌ఫ్లో కూడా కొనసాగుతోందని తెలిపారు.

అమెరికా ద్రవ్యోల్బణ డేటా (సీపీఐ) ఆ దేశంలో ధరల పెరుగుదల మందగిస్తుందని తెలిపింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ (యూఎస్ సెంట్రల్ బ్యాంక్) వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం పెట్టుబడిదారులు మరిన్ని పెట్టుబడులు పెడతారు. ఫలితంగా బంగారంపై డిమాండ్ పెరుగుతోంది. బంగారం ధరలు తులానికి రూ.85,000 – రూ. 86,500 మధ్య ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యూఎస్‌ డాలర్ మారక రేటు ఎలా ఉండనుందన్న విషయాన్ని పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరుగుతాయి.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన విశ్లేషకుడు అనుజ్ గుప్తా దీనిపై మాట్లాడుతూ.. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సుంకాలు (దిగుమతి పన్నులు) విధించడం గురించి వార్తలు ద్వారా బంగారం ధరలు ప్రధానంగా ప్రభావితమవుతున్నాయని చెప్పారు.

అమెరికాకు తమ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీపై ఫీజును వసూలు చేయాలని కెనడా తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా కెనడియన్ స్టీల్, అల్యూమినియమ్‌పై 50 శాతం మేర సుంకాలు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ఇది అమెరికా, కెనడా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. అమెరికాకు కెనడా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఫలితంగా అమెరికా స్టాక్ మార్కెట్లు (ఈక్విటీలు) పడిపోయాయి. అమెరికా డాలర్ బలహీనపడింది. ఇది బంగారం, ఇతర విలువైన లోహాలపై పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేలా చేసింది. ఈ పరిస్థితులు అన్ని అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగేలా చేశాయి.