India-Built Assets In Afghanistan : ఐఎస్ఐ ఆదేశాలతో..ఆఫ్ఘానిస్తాన్ లో భారత్ నిర్మించిన ఆస్తులపై తాలిబన్ దాడులు!

నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు.

Taliban (1)

India-Built Assets In Afghanistan నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. మరోసారి ఆఫ్ఘానిస్తాన్ ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ఆప్ఘానిస్తాన్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్ చేతుల్లో కీలుబొమ్మల్లా మారిపోయారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం,పాక్ నిఘా సంస్థ(ISI) ఏది చెబితే తాలిబన్లు అదే చేస్తున్నారు.

ఇప్ప‌టికే తాలిబన్లకు అండగా దాదాపు 10 వేల మంది పాకిస్తానీ ఉగ్రవాదులు ఆఫ్ఘానిస్తాన్ లోకి చొరబడినట్లు సమాచారం. వీళ్ల‌లో కొంతమంది ఎప్ప‌టి నుంచో ఆఫ్ఘ‌ానిస్తాన్‌లోనే ఉంటూ.. అమెరికా ద‌ళాల‌కు వ్య‌తిరేకంగా ఫైట్ చేశారు. అయితే ప్రస్తుతం తాలిబన్లు,పాకిస్తాన్ ఉగ్రవాదులు కలిసి ఆప్ఘానిస్తాన్ లోని భారత ఆస్తలు ధ్వంసం లక్ష్యంగా పనిచేస్తున్నారని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యుద్ధం వల్ల నష్టపోయిన ఆఫ్ఘ‌ానిస్తాన్‌లో గడిచిన కొన్నేళ్లుగా భారత దేశం నిర్మించిన భ‌వ‌నాలు, ప్రాజెక్టులు,ఆస్తులే ల‌క్ష్యంగా దాడులు చేయాలంటూ అక్క‌డి తాలిబ‌న్లు, పాకిస్తానీ ఉగ్రవాదులకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ నుంచి ఆదేశాలు అందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాగా, గడచిన రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘానిస్తాన్ పునర్నిర్మాణం కోసం భారత దేశం 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. భారత్ సహకారంతో నిర్మించిన వాటిలో ఆప్ఘానిస్తాన్ పార్లమెంటు భవనం,ఇండియా-ఆఫ్ఘ‌ానిస్తాన్ ఫ్రెండ్ షిప్ డ్యామ్ (సల్మా డ్యామ్‌),జారంజ్‌, డెలారామ్ మ‌ధ్య ఉన్న 218 కి.మీ. రోడ్డు చాలా ముఖ్యమైనవి. ఆఫ్ఘానిస్తాన్ లో విద్యాభివృద్ధికి కూడా భారత్ విశేషంగా సేవలందించింది. టీచర్లకు, బోధనేతర సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ఆప్ఘానిస్తాన్ లో 350 మిలియన్ డాలర్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఇటీవలే భారత ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో కాబూల్ నగరానికి తాగునీటి సదుపాయం కల్పించే ప్రాజెక్టు కూడా ఉంది.