ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు : ఉగ్రవాదులకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం..డబ్బులు అమెరికా ఇచ్చింది

ఉగ్రవాదులను పెంచి పోషించి పాక్,అమెరికానే అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. ఒక‌ప్పుడు ఉగ్ర సంస్థ  ముజాహిద్దీన్‌ ను పెంచి పోషించిన అమెరికానే ఇప్పుడు దాన్ని త‌ప్పుప‌డుతోంద‌ని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 1980ల్లో  ఆఫ్ఘ‌నిస్తాన్‌ను సోవియేట్ ర‌ష్యా స్వాధీనం చేసుకున్న‌ద‌ని, ఆ స‌మ‌యంలో సోవియేట్‌కు వ్య‌తిరేకంగా పోరాడేందుకు పాక్‌కు చెందిన ముజాహిద్దీన్ల‌ను జిహాదీలుగా అమెరికా వాడుకుంద‌ని ఇమ్రాన్ ఆరోపించారు.

ఆ జిహాదీల‌కు పాకిస్తాన్ శిక్ష‌ణ ఇచ్చింద‌ని, కానీ ఫండింగ్ మొత్తం అమెరికా నిఘా ఏజెన్సీ CIAనే చేసింద‌ని ఇమ్రాన్ అన్నారు. అయితే ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్థాన్‌లోకి  అమెరికా ద‌ళాలు వ‌చ్చిన త‌ర్వాత అగ్ర‌రాజ్యం త‌న వాద‌న‌ను మార్చేసింద‌న్నారు. ఒక‌ప్పుడు అమెరికా త‌ర‌పున పోరాడిన వారే ఇప్పుడు ఆప్ఘ‌నిస్తాన్‌లో ఉన్నార‌ని, కానీ వాళ్ల‌ను ఇప్పుడు అమెరికా ఉగ్ర‌వాదులుగా చూస్తోంద‌ని ఇమ్రాన్ అన్నారు.

ఇలాంటి విష‌యాల్లో పాక్ న్యూట్రల్ గా ఉండాలని తాను బలంగా భావిస్తున్నానని, ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రూపులే దేశానికి వ్య‌తిరేకం అయ్యాయ‌న్నారు. ఆ ఉగ్ర‌పోరులో సుమారు 70వేల మందిని పాక్ కోల్పోయిన‌ట్లు ఇమ్రాన్ తెలిపారు. ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా వంద బిలియ‌న్ల డాల‌ర్లకు పైగా న‌ష్ట‌పోయింద‌న్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో విజ‌యం సాధించ‌లేక‌పోయిన అమెరికా ఇప్పుడు పాక్ ను నిందిస్తోంద‌న్నారు.