మరో రెండు కేసుల్లో హఫీజ్ సయీద్ కి10ఏళ్ల జైలు శిక్ష

court sentences JuD chief Hafiz Saeed to 10 years in jail 26/11 ముంబై ఉగ్రదాడులతో సహా భారత్ లోని అనేక ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన జమాత్ ఉద్ దవా చీఫ్,గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కు గురువారం(నవంబర్-19,2020)మరో రెండు ఉగ్ర కేసుల్లో 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది పాకిస్తాన్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు. ఉగ్రసంస్థలకు నిధులు సమకూర్చిన రెండు కేసులకు సంబంధించి లాహోర్ లోని యాంటీ-టెర్రరిజం కోర్టు ఈ తీర్పునిచ్చింది.



ఈ కేసుల విషయంలో ఇప్పటికే సయీద్​.. గతేడాది జులై 17 నుంచి జైలులోనే ఉంటున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు కేసుల్లో హఫీజ్ కు 11 ఏళ్ల శిక్ష పడగా.. తాజాగా మరో 10 ఏళ్లు జైలు విధించింది కోర్టు. సయీద్​ సన్నిహితులైన జఫర్ ఇక్బాల్, యాహ్యా ముజాహిద్​లకు కూడా పదిన్నర ఏళ్లు, కజిన్ అబ్దుల్ రెహమాన్​ మక్కీకి ఆర్నెల్లు జైలు శిక్ష పడింది.



గతేడాది జులైలో లాహోర్ నుంచి గుజ్రాన్‌వాలా వెళ్తున్న సమయంలో హఫీజ్ ను సీటీడీ అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు, జూలై 2019 లో లాహోర్, గుజ్రాన్‌వాలా, ముల్తాన్, ఫైసలాబాద్ మరియు సర్గోధాలోని సీటీడీ పోలీస్ స్టేషన్లలో జేడీయూ లీడర్లు సయీద్ సహా నాయబ్ ఎమిర్ అబ్దుల్ రెహమాన్ మక్కీపై 23 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబడ్డాయి.



సీటీడీ ప్రకారం…అల్-అన్ఫాల్ ట్రస్ట్, దవతుల్ ఇర్షాద్ ట్రస్ట్, మువాజ్ బిన్ జబల్ ట్రస్ట్, వంటి నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ట్రస్టుల ద్వారా సేకరించిన భారీ నిధుల నుండి జేయూడీ ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్లను గతేడాది ఏప్రిల్ లో సీటీడీ బ్యాన్ చేసింది. పూర్తి ఇన్వెస్టిగేషన్ సమయంలో జేయూడీ,దాని అగ్రనాయకత్వంతో ఆ ఆర్గనైజేషన్లకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.