మనం దారిగుండా ముందుకు వెళ్తుంటాం. ఇంతలో మనకు ఎవరైనా అడ్డువచ్చారనుకోండి.. ‘జరగండి’ అని అడుగుతాం. అదే జంతువులు, పక్షులైతే ఇలా జరగండి అని అడుగుతాయా? లేదంటే మనం జరిగే వరకు వేచి చూసి, మనం పక్కకు జరిగాకా అవి వెళ్తాయా? ఇటువంటి పనే చేసింది ఓ పెంగ్విన్.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంటార్కిటికాలో మంచుపై ఓ పెంగ్విన్ నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో తన మార్గంలో ఓ ప్రేమ జంట అడ్డుగా నిలబడిందని పెంగ్విన్ గుర్తించింది. పక్కకు జరగండని అది నోటితో చెప్పలేదు కాబట్టి వారికి అలాగే చూస్తూ నిలబడిపోయింది.
చివరకు పెంగ్విన్‌ను చూసిన ఆ జంట పక్కకు జరిగి దారి ఇవ్వడంతో ఆ పెంగ్విన్ మళ్లీ ముందుకు కదిలింది. పెంగ్విన్‌లు కూడా మర్యాదను పాటిస్తాయా? అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ పెంగ్విన్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఓ యూజర్ కామెంట్ చేశాడు.