ఫిలిప్పీన్స్‌లో ఫాన్ ఫోన్ తుఫాన్ బీభత్సం..28 మంది మృతి

  • Publish Date - December 27, 2019 / 07:49 AM IST

ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ ఫాన్ ఫోన్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ రోజుల్లో సంభవించిన తుఫాన్ ధాటికి 28 మందిదాక మృతి చెందారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఫ్రావిన్స్ లో వరదల కారణంగా ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. చాలా మంది గల్లంతయినట్లు అధికారులు గుర్తించారు. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి.

 

దీంతో ఎన్నో ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. తీరప్రాంత నగరమైన బటాడ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని, భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు. సుమారు 58 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది చెట్లు మీద పడడం వల్ల కొంతమంది, విద్యుత్ ఘాతానికి గురై మరికొందరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

క్రిస్మస్ పండుగ సందర్భంగా వేలాది మంది తమ తమ స్వగ్రామాలకు వెళ్లారు. కానీ తుఫాన్ కారణంగా వీరంతా చిక్కుకపోయారు. ప్రసిద్ధ పర్యాటక ద్వీపమైన బోరాకే తుఫాన్ కారణంగా దెబ్బతింది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంటర్నెట్ సదుపాయాలు కట్ అయ్యాయి. ప్రస్తుతం తుఫాన్ దక్షిణ చైనా వైపుకు వెళ్లినట్లు అక్కడి వాతావరణ శాఖా అధికారులు భావిస్తున్నారు. 
Read More : కొత్త కొత్తగా 2020: న్యూ ఇయర్‌కి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చెయ్యొచ్చు