Philippine Mayor Aristotle Aguirre Orders..“smile Policy”
Philippine mayor Aristotle Aguirre orders..“Smile Policy” : సాధారణంగా పనిమీద గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్లాల్సి వస్తే అదొక పెద్ద తలనొప్పే. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు అంత తేలిగ్గా పనులు చేయరు. చాలా సార్లు అస్సులు సరిగ్గా సమాధానమే చెప్పరు. ఏదో వారి సొంత డబ్బులు ఇస్తున్నట్లుగా..వారి ఉద్యోగ బాధ్యలు కాకుండా మన సొంతపని వారు చేస్తున్నట్లుగా చికాకుగా సమాధానం చెబుతారు. కొంతమంది అస్సలు అదికూడా చెప్పరు. నిర్లక్ష్యంగా ఉంటారు.గవర్నమెంట్ ఆఫీసులో పని జరగాలంటే చేతులు తడపాలి..గంటలు..రోజులు వారాల తరబడి ఎదురుచూపులు చూడాలి. కొన్ని విషయాల్లో సంవ్సరాలు గడిచినా పనులు అవ్వవు చెప్పులు అరిగేలా తిరిగినా..ఉద్యోగులనుంచి విసుగు..చికాకు సమాధానాలు వినలేక తలపట్టుకోవాల్సిందే. కానీ ఇకపై ప్రజలతో ప్రభుత్వ ఉద్యోగులు చికాకుగా సమాధానం చెబితే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చింది ఫిలిప్పీన్స్ లోని ఓ నగరపాలక సంస్థ. ప్రజలతో ఉద్యోగులు నవ్వుతూ సమాధానం చెప్పాలని లేదంటే ఆరు నెలల జీతం జరిమానా కట్టాలని హెచ్చరించింది…!!
ఫిలిప్పీన్స్ లోని ప్రధాన ద్వీపం లుజోన్‌లోని క్యూజోన్ ప్రావిన్స్‌లోని ‘ములానే పట్టణం’మేయర్ అరిస్టాటిల్ అగ్యురే ప్రమాణస్వీకారం చేశాక జులై నెలలో “స్మైల్ పాలసీ”ని ప్రవేశపెట్టారు. అధికారులు ప్రజలతో ప్రశాంతంగా..స్నేహపూర్వక వాతావరణంలో వ్యవహరించాలని.. నవ్వుతూ సమాధానం చెప్పాలని నగర మేయర్ అరిస్టాటిల్ అగ్విరే ఆదేశించారు. ఈ ఆదేశాలు పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు.
మేయర్ అరిస్టాటిల్ మార్క్ పాలనలో ‘స్మైల్ పాలసీ’
అరిస్టాటిల్ అగ్విరే ఇటీవలే ములానే నగర మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. నగరంలో ప్రభుత్వ పాలన పరిస్థితిని మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతూ ‘స్మైల్ పాలసీ’ని అమల్లోకి తీసుకువచ్చారు. అధికారుల తీరుపై స్థానిక మత్స్యకారులు, కొబ్బరి పెంపకం దారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. పన్నులు కట్టడానికి వచ్చినవారితోనూ చికాకుతో వ్యవహరించార మేయర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఉద్యోగుల తిక్క కుదర్చాలనుకున్నారు మేయర్ అరిస్టాటిల్. దీంట్లో భాగంగానే సరికొత్తగా ‘స్మైల్ పాలసీ’ విధానాన్ని తీసుకువచ్చామని తెలిపారు.
రూల్ బ్రేక్ చేస్తే..6 నెలల జీతం జరిమానా..లేదంటే..
ప్రజలతో ఉద్యోగులు నవ్వుతూ వ్యవహరించాలని లేదంటే అధికారులు, సిబ్బంది ఆరు నెలల వేతనాన్ని జరిమానాగా కట్టాల్సి ఉంటుందని మేయర్ హెచ్చరించారు. ఒకవేళ జరిమానా కట్టకపోతే తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానని కూడా హెచ్చరించారు. దీంతో అధికారులకు, సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది. మున్సిపాలిటీకి వివిధ పనుల కోసం చాలా దూరం నుంచి ప్రజలు వస్తుంటారని.. వారి పట్ల దయగా, మర్యాదగా వ్యవహరించాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ప్రజలు కట్టే పన్నులతోనే ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయని విషయం మర్చిపోరాదని..సూచించారు.