Modi US Visit: మోదీ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్.. యోగా డేతో మొదలై.. మెగా ఒప్పందాలతో ముగింపు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. మోదీ పర్యటనలో భాగంగా రెండు అగ్రదేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.

PM Narendra Modi US Visit Success

Modi US Visit Success: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. యోగా డే (Yoga Day) తో మొదలైన మోదీ పర్యటన.. మెగా ఒప్పందాలతో ముగిసింది. వైట్ హౌజ్‌ (White House)లో బైడెన్ దంపతుల స్వాగతం, పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, అధికారిక విందు, ప్రెసిడెంట్ బైడెన్‌తో ఉన్నత స్థాయి సమావేశం, కీలక ఒప్పందాలు(vital agreements), ప్రధాన వాణిజ్య వివాదాలకు పరిష్కారం.. ఇలా మోదీ టూర్ (Modi Tour) అంతా.. అమెరికా-భారత్ మధ్య ఇప్పటికే ఉన్న బంధాన్ని.. మరింత బలోపేతం చేసే దిశగా సాగింది. భవిష్యత్తుల్లోనూ వ్యాపార, వాణిజ్య విషయాల్లో.. రెండు దేశాలు పరస్పరం సహకరించుకునేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ద్వైపాక్షిక చర్చల్లో.. కీలక ఒప్పందాలు
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో.. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌-ప్రైమ్ మినిస్టర్ మోదీ మధ్య జరిగిన ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చల్లో.. కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఉన్న ఆరు ముఖ్యమైన వాణిజ్య వివాదాలకు పరిష్కారం దొరికింది. ఈ విషయంలో.. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరినట్లు.. అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరిన్ టాయ్ ప్రకటించారు. దీనిని.. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు నివేదిస్తే.. పరిష్కార ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు.. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 28 వస్తువులపై గతంలో విధించిన ప్రతీకార సుంకాన్ని సైతం తొలగించేందుకు భారత్‌ అంగీకరించింది.

వాణిజ్య వివాదాలకు పరిష్కారం
2018లో భారత్‌ నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌, అల్యూమినియంపై.. జాతీయ భద్రత పేరిట 25 శాతం, 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది అమెరికా. దీనికి కౌంటర్‌గా.. 2019 జూన్‌లో అమెరికా నుంచి భారత్‌కు వచ్చే 28 వస్తువులపై కేంద్రం సుంకాన్ని పెంచింది. వీటిలో.. శనగలు, కొన్ని రకాల పప్పులు, బాదం, వాల్‌నట్స్, యాపిల్‌, బోరిక్‌ యాసిడ్‌, మెడికల్ టెస్టుల్లో వినియోగించే రీఏజెంట్ల లాంటివి.. భారత్ సుంకం విధించిన వస్తువుల లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు.. వాటన్నింటిపై సుంకాన్ని తొలగించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం వల్ల.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు విస్తరిస్తాయని చెబుతున్నారు. భారత్‌ నుంచి కొన్ని హాట్-రోల్డ్ కార్బన్ స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తులపై.. కౌంటర్‌వైలింగ్ చర్యలు, సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌కు సంబంధించిన అంశాలు, రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి సంబంధించిన చర్యలు, ఎగుమతుల సంబంధిత చర్యలు, ఉక్కు- అల్యూమినియం ఉత్పత్తులపై చర్యలు, అదనపు సుంకాలు వంటివి తాజాగా పరిష్కారమైన ఆరు కీలక వాణిజ్య వివాదాల్లో ఉన్నాయి.

ఆర్థిక, వాణిజ్య బంధాలు బలోపేతం
నిజానికి.. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ ఆర్థిక సంవత్సరంలో.. ద్వైపాక్షిక సరకుల వాణిజ్యం వార్షిక ప్రాతిపదికన 128.8 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. వాణిజ్యపరంగా కొన్ని అంశాల్లో రెండేళ్లుగా నెలకొన్న ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలకు.. తాజా సయోధ్యతో పరిష్కారం దొరికింది. ఫలితంగా.. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య బంధాలు బలోపేతం అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని అవకాశాల కోసం భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.

Also Read: మళ్లీ మళ్లీ మోదీనే.. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్‭గా ప్రధాని మోదీ

రక్షణ రంగంలో పరస్పర సహకారం
ఇక.. తాజా పర్యటనలోనే భారత్-అమెరికా మధ్య కీలక రంగాల్లో భాగస్వామ్యంపై ప్రెసిడెంట్ జో బైడెన్‌తో.. పీఎం మోదీ చర్చించారు. ముఖ్యంగా.. రక్షణ రంగంలో పరస్పర సహకారం, టెక్నాలజీ షేరింగ్‌పై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే అత్యంత కీలక ఒప్పందం కుదిరింది. భారత్‌లో యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీకి అవసరమయ్యే టెక్నాలజీని బదలాయించేందుకు.. అమెరికా దిగ్గజ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ అంగీకరించింది. ఈ మేరకు జీఈ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఇంజిన్లను భారత వాయుసేనకు చెందిన తేజస్ మార్క్-2 యుద్ధవిమానాల్లో అమరుస్తారు. ఇప్పటివరకు ఈ జెట్ ఇంజిన్ల తయారీ సాంకేతికత అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు తొలిసారి ఈ టెక్నాలజీని అమెరికా భారత్‌కు అందించాలని నిర్ణయించింది.

Also Read: బెంగళూరు, అహ్మదాబాద్‌లలో కాన్సులేట్లు ఏర్పాటు.. మోదీ పర్యటన వేళ అమెరికా కీలక ప్రకటన

ఈజిప్ట్ పర్యటనకు ప్రధాని మోదీ
ఇకపై జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ తయారు చేసే శక్తిమంతమైన ఎఫ్414 జెట్ ఫైటర్ ఇంజిన్లను భారత్‌లోనూ ఉత్పత్తి చేయనున్నారు. వీటి ఉత్పత్తి.. రెండు దేశాలకు ఆర్థిక, జాతీయ భద్రత ప్రయోజనాలను అందిస్తాయి. అమెరికా టూర్‌లోనే.. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అధినేత ఎలన్ మస్క్‌.. ప్రధాని మోదీతో భేటీయ్యారు. ఆయన సహకారంతో.. త్వరలోనే టెస్లాను ఇండియాకు తీసుకురాబోతున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. ఈ న్యూస్ కూడా వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాలో పర్యటనలో ఆఖరి రోజు.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. ప్రధాని మోదీకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అది ముగిశాక.. నేరుగా ఈజిప్ట్ పర్యటనకు బయల్దేరారు ప్రధాని మోదీ.