Jo Lindner (Photo : Google)
Bodybuilder Jo Lindner : జో లిండ్నర్.. ఓ ప్రముఖ బాడీ బిల్డర్. యూట్యూబ్ లో జోస్తెటిక్స్ గానూ గుర్తింపు పొందాడు. కండలు తిరిగిన దేహం అతడి సొంతం. ఫిట్ నెస్ కు మారుపేరుగా లిండ్నర్ ను చెప్పుకుంటారు. అలాంటి బాడీ బిల్డర్ హఠాత్తుగా చనిపోయాడు. అదీ కేవలం 30ఏళ్లకే మరణించాడు. లిండ్నర్ మరణ వార్త యావత్ బాడీ బిల్డింగ్ ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. లిండ్నర్ ఇక లేడనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లిండ్నర్ చావుకి కారణం ఏంటో తెలిసి.. అంతకుమించి అంతా షాక్ అవుతున్నారు.
జో లిండ్నర్ హఠాన్మరణానికి కారణం ‘రిప్లింగ్ మజిల్ డిసీజ్’. ఇదో అరుదైన కండరాల వ్యాధి. దీని కారణంగా లిండ్నర్ చనిపోయాడు. దీని వల్ల కండరాలు అతి సున్నితంగా మారిపోయి ఏ మాత్రం కదలిక కనిపించినా తీవ్రమైన నొప్పి సంభవిస్తుంది. దీన్ని గుర్తించడంలో బాగా ఆలస్యం చేశామని లిండ్నర్ గర్ల్ ఫ్రెండ్ నిచా వాపోయారు. ”3 రోజుల క్రితం మెడ నొప్పిగా ఉందని లిండ్నర్ తెలిపాడు. దాన్ని గుర్తించడంలో బాగా ఆలస్యం చేశాం. కండరాల పెంపుదల కోసం కొన్ని వారాల క్రితం అధికంగా జిమ్‌లో శిక్షణ తీసుకున్నాడు. అధిక కసరత్తుల వల్ల గుండెపోటు వస్తుందని అప్పుడే భయపడ్డా” అని నిచా చెప్పారు.
కాగా, తన ఫిట్ నెస్ వీడియోలతో లిండ్నర్ వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు. ఒక్క ఇన్ స్టాలోనే అతడికి ఏకంగా 85లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. జో లిండ్నర్ తన ఫిట్‌నెస్ వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసేవాడు. అతడి కండలు తిరిగిన దేహానికి, ఫిట్ నెస్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో ఫిట్ గా ఉండే వ్యక్తి.. సడెన్ గా అదీ 30ఏళ్ల వయసుకే ఇలా చనిపోయాడంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు.
ఇక, కండరాల పని తీరును మెరుగుపరిచే డ్రగ్స్, స్టెరాయిడ్స్ పాత్ర పైనా అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బహుశా లిండ్నర్ మరణానికి ఆ రెండు దోహదపడి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోతాదుకి మించిన స్టెరాయిడ్స్ వాడకం చాలా ప్రమాదకరం అంటున్నారు. అనాబాలిక్ స్టెరాయిడ్లను ఉపయోగించడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఏర్పడవచ్చని.. ఇది రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్‌కు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.