మేల్కొన్నారు : చైనాలో కుక్కల మాంసం విక్రయాలపై నిషేధం

  • Publish Date - April 11, 2020 / 02:57 AM IST

ఏది పడితే అది తింటారు.. మీ వల్లే ఇవాళ ప్రపంచమంతా ఇబ్బంది పడుతోందన్న తిట్లు, శాపనార్థాలకు చైనా బుద్ధి తెచ్చుకున్నట్లుంది. దేశంలో కుక్కల మాంసం విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించింది. ఇకపై కుక్కల్ని కూడా పెంపుడు జంతువులుగానే చూడాలని ఆదేశించింది.

క్షవరం అయితే కానీ.. వివరం తెలియదంటారు. చైనా విషయంలోనూ అలాగే జరిగింది. వింత ఆహారపు అలవాట్లతో ప్రపంచ దేశాలపై కొత్త వైరస్ వదిలి ఛీత్కారాలు ఎదుర్కొన్న చైనీయులు ఇప్పుడు మేల్కొన్నారు. ఇకముందు కుక్కని పెంపుడు జంతువుగానే చూడాలని… శునకాల మాంసం అమ్మొద్దని చైనా ప్రభుత్వం ఆర్డర్‌ పాస్‌ చేసింది. పెంపుడు జంతువుల జాబితాలో శునకాల్ని కూడా చేరుస్తూ చైనా వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుఉంది.

చైనాలో ఏటా రెండు కోట్ల దాకా కుక్కల్ని తింటారు. ప్రత్యేకించి గ్యాంగ్జీ ప్రావిన్సులోని యులిన్ సిటీలోనైతే జూన్ 21 నుంచి 30 వరకూ ప్రత్యేకంగా కుక్క మాంసం పండుగనే నిర్వహిస్తారు. ఆ సందర్భంగా వేలాది కుక్కలను చంపేసి తినేస్తారు. ఈ కుక్కల మాంసం పండగ వేళ… ప్రజలు తమకు కావల్సిన కుక్కను తామే ఎంపిక చేసుకుని చెబితే, వారి ఎదుటే చంపేసి మాంసం ప్యాక్ చేసి ఇస్తారు.

వేసవి కాలంలో ప్రజలు కావాలని తమల్ని కుక్క మాంసం కావాలంటూ వేధిస్తారని రెస్టారెంట్లు చెప్తుంటాయి. ఇది దారుణమనీ, అమానుషమనీ… వెంటనే ఇలాంటివి ఆపేయాలని కూడా అక్కడ లక్షల మంది ప్రభుత్వానికి పిటిషన్లు పెడుతూ వస్తున్నారు. కానీ.. జనం విజ్ఞప్తిని ఏళ్ల తరబడిగా పెడచెవిన పెట్టిన జిన్‌పింగ్‌ ప్రభుత్వం… కరోనా దెబ్బకు దారికొచ్చింది. డాగ్‌ మీట్‌ను బ్యాన్‌ చేయడంతో పాటు వాటిని పెట్‌ యానిమల్స్‌గా చూడాలన్న జిన్‌పింగ్‌ సర్కార్‌ నిర్ణయాన్ని జంతు ప్రేమికులు స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని గేమ్‌ ఛేంజర్‌గా అభివర్ణించారు.

కరోనా వైరస్ విజృంభించిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో అడవి జంతువుల మాంసం విక్రయాల్ని వినియోగాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత కుక్క, పిల్లి మాంసం అమ్మకాల్ని, వినియోగాన్ని నిషేధించిన మొట్ట మొదటి నగరంగా షెన్జెన్ అవతరించింది. ఇక్కడ ప్రతి ఏటా దాదాపు 10 మిలియన్ల కుక్కలు, 4 మిలియన్ పిల్లులను చంపి మాంసం విక్రయిస్తుంటారు. కానీ, కరోనా మహమ్మారికి వధశాలలే కారణమనే వాదనలు పుట్టుకురావడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ అలవాటున్న తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ… కుక్కల మాంసం విక్రయించడాన్ని బ్యాన్‌ చేశారు.(ఏపీలో కరోనా : ఫస్ట్ ప్లేస్ కర్నూలు, సెకండ్ ప్లేస్ గుంటూరు)