Alexei Navalny: ఎన్నికల వేళ రష్యాలో కలకలం.. పుతిన్‌ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ జైలులో మృతి

తనను ఎదిరించిన వారిని అణగదొక్కేందుకు ఏ స్థాయికైనా వెళ్లే పుతిన్‌.. ప్రతిపక్ష నేత విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించారనే..

Russia Opposition Leader Alexei Navalny

రష్యాలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ.. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రత్యర్థి, ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న నావల్నీ.. జైలులోనే మృతిచెందడం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం జైలులో వాకింగ్‌ చేసిన తర్వాత అస్వస్థతకు గురైన ఆయన.. వెంటనే స్పృహ కోల్పోయారు. వైద్య సేవలందించినా.. మృతిచెందినట్లు జైలు అధికారులు ప్రకటించారు.

రష్యాలో అవినీతి వ్యతిరేకంగా ఫౌండేషన్‌ స్థాపించిన అలెక్సీ నావల్నీ.. తొలి నుంచీ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే రష్యా ఇన్‌ ద ఫ్యూచర్‌ పేరిట పార్టీని స్థాపించి.. పుతిన్‌ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై పోరాటం సాగించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడం ద్వారా అలెక్సీకి దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభించింది.

ఆ తర్వాత కూడా పుతిన్‌ ప్రభుత్వం పోరాటం సాగించిన నావల్నీపై.. 2020లో సెర్బియాలో విష ప్రయోగం జరిగింది. జర్మనీలో కొన్ని నెలలపాటు చికిత్స తీసుకొని ప్రాణాలతో బయటపడిన ఆయన.. 2021 జనవరిలో రష్యాకు తిరిగి వచ్చారు. అయితే.. రష్యాలో అడుగు పెట్టగానే ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిధులు దుర్వినియోగంతో పాటు పలు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం నావల్నీకి 19 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

తనను ఎదిరించిన వారిని అణగదొక్కేందుకు ఏ స్థాయికైనా వెళ్లే పుతిన్‌.. ప్రతిపక్ష నేత విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. పుతిన్‌ విధానాలను వ్యతిరేకించినందుకే అలెక్సీని కేసుల్లో ఇరికించారని ఆయన మద్దతుదారులు ఆరోపించారు.

మూడేళ్ల నుంచి మాస్కోకు 150 మైళ్ల దూరంలో ఉన్న ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు నావల్నీ. పుతిన్‌పై పోరాటంతో ఎంతో ప్రజాదరణ పొందిన నావల్నీపై ఓ డాక్యుమెంటరీ సైతం చిత్రీకరించారు. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని కెనడాకు చెందిన డైరెక్టర్‌ డేనియల్‌ రోహర్‌… నావల్నీ పేరిట ఓ సినిమా తీశారు. దీనికి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌గా ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు లభించింది.

కొద్ది రోజుల్లో రష్యా ఎన్నికలు జరగనున్న వేళ.. ప్రతిపక్ష నేతగా ఉన్న 47 ఏళ్ల నావల్నీ మృతిచెందడం వివాదాస్పదంగా మారింది. కొద్ది నెలల క్రితం ఆయన జైల నుంచి అదృశ్యమైనట్లు వార్తలు రావడం.. జైలు గదిలోనే అలెక్సీ అనారోగ్యానికి గురై మృతిచెందడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

10 గ్రాముల బంగారం ధర ఆలోగా రూ.70 వేలకు చేరనుందా? ఇప్పుడే కొంటే?

ట్రెండింగ్ వార్తలు