భారత దేశంలో జరిగే పెళ్శిళ్లలో ప్రేమ పెళ్లి చేసుకునే యువతీయువకుల సంఖ్య 10 శాతానికి మించటం లేదని లెక్కలు చెపుతున్నాయి. మిగతా 90 శాతం పెళ్ళిళ్లు అరేంజ్డ్, సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్ధ ఇక్కడ పటిష్టంగా ఉందనే చెప్పాలి. పెళ్లివిషయంలో ఇక్కడ పిల్లలు పెద్దల మాటను వింటారనటానికి ఇదే పెద్ద ఉదాహరణ. అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ముఖ పరిచయం కూడా లేకుండా పెద్దలు, మధ్యవర్తులు కుదుర్చిన పెళ్లిళ్లు కాగా… మిత్రుల ద్వారానో, పెద్దల ద్వారానో పరిచయమై ఒకరికొకరు కొంత అర్థం చేసుకుని చేసుకొనే పెళ్ళిళ్లను సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్‌గా వ్యవహరిస్తున్నారు.
పెళ్లి సంబంధాలు కుదిర్చే విషయంలో ఇదివరకు మ్యారేజ్ బ్యూరోలు, కొన్ని వివాహా సంస్థలు ప్రధాన పాత్ర వహించగా, నేటి ఆధునిక టెలికామ్ కాలంలో డేటింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇప్పటికే పెళ్లి సంబంధాల కోసం అనేక వెబ్ సైట్లు వివిధ కేటగిరీల్లో తమ సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా యాప్ లు కూడా యూత్ కు అందుబాటులోకివచ్చాయి. భారత్, ఇతర దక్షిణాసియా దేశాల యువతీ యువకుల కోసం శాన్ ఫ్రాన్సిస్కోకేంద్రంగా ఏర్పాటయిన ‘దిల్ మిల్’ యాప్ ప్రస్తుతం యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో కోట్ల మంది యూజర్లు యాప్ ను ఉపయోగిస్తున్నారు.
ఇప్పటికే ఈ యాప్ ద్వారా రెండు కోట్లకు పైగా పెళ్లిళ్లు జరిగాయట. రోజుకు కనీసం ఒక్క పెళ్లి చేయడం తమ విజయానికి కారణమని ‘దిల్ మిల్’ వ్యవస్థాపకులు, సీఈవో కేజే దలివాల్ చెప్పుకొచ్చారు. తక్కువ పెట్టుబడితో మొదలైన ఈ యాప్ ఇప్పుడు భారతీయ కరెన్సీలో 357 కోట్ల రూపాయలకు చేరుకుంది. తమ యాప్ విజయానికి ‘డేటింగ్ డాట్ కామ్, డేట్‌మైఏజ్, లవింగ్‌ఏ, టుబిట్, అనస్థేసియా డేట్, చైనాలవ్…’ తదితర డేటింగ్ వెబ్‌సైట్లు ఎంతో కారణమని కూడా దలివాల్ తెలిపారు.
అమెరికా, కెనడాలతోపాటు బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో నివసిస్తున్న దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ, యువకుల కోసమే ఈ ‘దిల్ మిల్’ యాప్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు దలివాల్. దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ యువకుల్లో 80 శాతం మంది దక్షిణాసియా దేశాలకు చెందిన వారినే పెళ్లి చేసుకోవడానికి ఇష్ట పడుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా భారతీయులు స్థిరపడ్డారని, ఇప్పుడు వారిని తమ యాప్ ప్రధానంగా ఆకర్షిస్తోందని దలివాల్ తెలిపారు. 2040 సంవత్సరం నాటికి ప్రతి పది మందిలో ఏడుగురు ఈ యాప్ ద్వారా కలుసుకుంటారని దిల్ మిల్ అంచనా వేస్తోంది.
ఈ యాప్ ను 25 ఏళ్ల వయస్సువాళ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారుట. అమెరికాలో స్ధిరపడిన దక్షిణాసియాకు చెందిన తొలి, రెండో తరంలో ఈయాప్ ఎక్కువ మార్కెట్ ఉంది. ఈ యాప్ ద్వారా మహిళలు కేవలం ఎన్ఆర్ఐలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈయాప్ ద్వారా సొంత సామాజిక వర్గానికి చెందిన వారినీ ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ యాప్ కు మరో ప్రత్యేకత ఉంది. ఒకరితో ఒకరు షేర్ చేసుకునే సమాచారం ఫోటోలు వారిద్దరు మినహా మరోకరు చూసే అవకాశం షేర్ చేసుకునే ఆస్కారం అసలు ఉండదు. యువతీ యువకులు ముఖాముఖీ కలుసుకునేందుకు యాజ్ యాజమాన్యం కొన్ని ఈవెంట్లను నిర్వహిస్తోంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తో ప్రేమ గురించి వివరిస్తూ రెండు వీడియోలు కూడా రిలీజ్ చేసింది.