Rat
RAT : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త తరహాలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి టీమ్‌వ్యూయర్, ఎనీడెస్క్, క్విక్ సపోర్టు యాప్‌లను డౌన్‌లోడ్ చేయించి.. యూపీఐ ఐడీ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపించి బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టేవారు. పోలీసులు ఇలాంటి నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడంతో.. కొత్త దారి ఎంచుకున్నారు. అదే.. రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ఆర్‌ఏటీ-ర్యాట్). దీని ద్వారా ఓ లింక్‌ను పంపుతారు. దానిని క్లిక్ చేసేలా మాటలతో బోల్తా కొట్టించి మీ ఖాతాల్లోని నగదును మాయం చేస్తారు.
ర్యాట్ (RAT) అంటే..
* రిమోట్ యాక్సెసింగ్ టూల్(రిమోట్ యాక్సెస్ ట్రోజన్) ద్వారా లింక్‌ను తయారు చేస్తున్న సైబర్ మోసగాళ్లు దానిని బల్క్ ఎస్ఎంఎస్ రూపంలో మొబైల్స్‌కు పంపిస్తున్నారు. * ఎస్బీఐ నుంచి పంపుతున్నట్టుగా చెబుతూ.. కేవైసీ అప్‌డేట్ చేసుకోకపోతే మీ ఖాతా మరో ఆరు గంటల్లో క్లోజ్ అవుతుందని హెచ్చరిస్తారు.
* తర్వాత స్వయంగా ఫోన్లు చేసి ఇటీవల మీరు జరిపిన లావాదేవీలకు కేవైసీ అప్‌లోడ్ లేకపోతే మీ ఖాతాల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా ఉంటుందంటూ భయపెడతారు.
* వారు చెప్పినట్టు లింక్‌పై క్లిక్ చేస్తే ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను తలపించేలా పేజీ కనపడుతుంది. అందులో వివరాలను ఎంట్రీ చేయించి.. తర్వాత ఆన్‌లైన్ ద్వారా చిన్న ఆర్థిక లావాదేవీ జరిపిస్తారు. ఈ సమయంలోనే మన వివరాలన్నింటినీ వారు తమ స్క్రీన్‌పై చూసుకుని.. తాపీగా ఖాతాలను ఖాళీ చేస్తారు.
ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచించారు. సైబర్ క్రిమినల్స్ రిమోట్ యాప్‌ల స్థానంలో ఇప్పుడు ర్యాట్ ద్వారా లింక్‌లను రూపొందిస్తున్నారని, ఈ టూల్ ద్వారా మీరు నొక్కే ప్రతి బటన్ దృశ్యాన్ని సైబర్ నేరగాళ్లు ప్రత్యక్షంగా వీక్షించేలా వీలుంటుందన్నారు. దీనిపై ఇటీవల 10 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాటిని విశ్లేషించి.. విచారించగా ఈ విషయం బయటపడిందన్నారు. ఈ సైబర్ నేరగాళ్లు జార్ఖండ్ జామ్‌తారా, పశ్చిమబెంగాల్ ప్రాంతాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నాం అన్నారు. కాగా, కేవైసీని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలంటూ ఏ బ్యాంక్ అడుగదని సైబర్ నిపుణులు స్పష్టం చేశారు. మీ ఖాతాలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా బ్యాంక్ అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సైబర్ నిపుణులు సూచించారు.