కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ మళ్లీ నోరు జారుతున్నాడు. కశ్మీర్ విషయం భారత అంతర్భాగమని భారత్ పదే పదే చెబుతున్న పూటకో మాట్లాడుతున్నాడు ట్రంప్. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ మరోసారి అన్నారు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరైన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సోమవారం ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను తాను పాకిస్తాన్ కు స్నేహితుడిగా అభివర్ణించుకున్న ట్రంప్.. ఇమ్రాన్ ఖాన్ ‘గ్రేట్ లీడర్’ అని చెప్పారు. ఆ సమావేశానికి ముందు ట్రంప్, ఇమ్రాన్ ఖాన్ ఒక మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ట్రంప్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం హ్యూస్టన్ లో జరిగిన ‘హౌడీ మోడీ’ కార్యక్రమంలో 59 వేల మంది సమక్షంలో చాలా దూకుడుగా ప్రకటన చేశారు అని చెప్పారు. భారత ప్రధానమంత్రి మోడీ వైపు నుంచి నిన్న చాలా అగ్రెసివ్ ప్రకటన విన్నాను. నేను అక్కడే ఉన్నాను. నేను అలాంటి ప్రకటన వింటానని అనుకోలేదు. అక్కడున్న వారందరికీ అది బాగానే అనిపించింది. కానీ అది చాలా దూకుడుగా ఉంది అని ట్రంప్ అన్నారు. నరేంద్ర మోదీ ఆదివారం హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా “సొంత దేశాన్నే నడపలేని వారికి, భారత్ తీసుకునే నిర్ణయాలతో ఇబ్బంది వస్తోందని, వారు తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారని చెప్పిన విషయం తెలిసిందే.
కశ్మీర్ ఓ సంక్లిష్టమైన సమస్య అని, కానీ రెండు దేశాలు అంగీకరిస్తేనే దానిపై రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతుందని ట్రంప్ అన్నారు. భారత ప్రధాని మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ తోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. గతంలో తానెప్పుడూ మధ్యవర్తిగా విఫలం కాలేదని, కశ్మీర్ సమస్యపై తాము కావాలనుకుంటే అందుబాటులో ఉంటానన్నారు. అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశమని, ఆ దేశానికి సమస్యలను పరిష్కరించే సత్తా ఉందని ఇమ్రాన్ అన్నారు. అమెరికా, పాక్ సంబంధాలపైన కూడా ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో అమెరికా దేశాధ్యక్షులు పాక్‌తో సరైన సంబంధాలు నెలకొల్పుకోలేదన్నారు. పాకిస్థాన్ ను నమ్ముతానని, ఇమ్రాన్ ఖాన్‌ను కూడా విశ్వసిస్తానని ట్రంప్ తెలిపారు.