China
Russia Ukriane War : మిలటరీ ఆపరేషన్ పేరుతో యుక్రెయిన్ పై రష్యా దాడికి దిగింది. ఆ దేశం పై బాంబుల వర్షం కురిపిస్తోంది. గురువారం ఉదయం నుంచి కొనసాగుతున్న దాడులతో యుక్రెయిన్ బెంబేలెత్తిపోతోంది. అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతున్న రష్యా… యుక్రెయిన్ ను ఆక్రమించుకునే దిశగా వెళ్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. రష్యా తీరుపై తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ సహా ప్రపంచంలోని చాలా దేశాలు రష్యా దాడిని ఖండించాయి. అదే సమయంలో రష్యాని సపోర్ట్ చేసే దేశాలూ లేకపోలేదు. చైనా, పాకిస్తాన్.. పుతిన్ ను సమర్థిస్తున్నారు. యుక్రెయిన్ పై రష్యా దాడి సరైందే అంటున్నాయి.
యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణకు చైనా పరోక్షంగా మద్దతు తెలిపింది. దీన్ని దండయాత్రగా.. విదేశీ మీడియా చూపించడాన్ని చైనా తప్పుపట్టింది. రష్యాది దండయాత్ర కాదనే కోణంలో మాట్లాడింది. రష్యా చర్యలను “దండయాత్ర” అని పిలవడానికి చైనా నిరాకరించింది. అంతేకాదు అగ్రరాజ్యం అమెరికా, దాని మిత్రదేశాలను విమర్శించింది. యుక్రెయిన్ విషయంలో అంతా సంయమనం పాటించాలని మరోసారి కోరింది చైనా. ”తాజా పరిస్థితిని చైనా నిశితంగా గమనిస్తోంది. సంయమనం పాటించాలని, పరిస్థితి అదుపు తప్పకుండా నిరోధించాలని పిలుపునిస్తాము” అని డ్రాగన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు. సైనిక చర్యను “దండయాత్ర” అని పిలవడానికి హువా నిరాకరించారు.
Imran khan Russia Visit : యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని సమర్ధించిన ఇమ్రాన్ ఖాన్
చైనా మాత్రమే కాదు పాకిస్తాన్ కూడా రష్యాను సపోర్ట్ చేస్తోంది. యుక్రెయన్ పై రష్యా దాడి సరైందే అంటున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. రెండు దేశాల మధ్య హోరా హోరీగా యుద్దం జరుగుతుంటే పాక్ ప్రధాని ఇమ్రాన్ మాత్రం రష్యాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం వెళ్లారు ఇమ్రాన్. రష్యా పర్యటనలో భాగంగా బుధవారం (ఫిబ్రవరి 23)న రష్యా రాజధాని మాస్కోకు చేరారు ఇమ్రాన్. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. రష్యా పర్యటన తనకు ఆనందాన్నిస్తోందని తెలిపారు.
మరోవైపు యుక్రెయిన్ పై తమ బలగాలు దాడులు చేయడం లేదని బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకో స్పష్టం చేశారు. తమ మిత్ర దేశమైన రష్యా.. వారి బలగాలతో తమ భూభాగం నుంచి దాడులు చేస్తోందన్నారు.
గురువారం(ఫిబ్రవరి 24) ఉదయం నుంచి మిలిటరీ ఆపరేషన్ అంటూ దాడులకు దిగిన రష్యా యుక్రెయిన్‌ను చుట్టేస్తోంది. యుక్రెయిన్‌పై మూడు దిక్కుల నుంచి రష్యా మెరుపు దాడులకు దిగింది. తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి యుక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. దీంతో యుక్రెయిన్ వాసులతో పాటు ఆ దేశంలో ఉంటున్న ఇతర దేశస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రష్యా దాడులు లేని నాలుగో దిక్కైన పడమర వైపుగా పరుగులు పెడుతున్నారు.
Crude-Gold Price : రష్యా-యుక్రెయిన్ వార్‌తో క్రూడ్, బంగారానికి రెక్కలు
తమ దేశంపై రష్యా దాడి నేపథ్యంలో యుక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమపై దాడికి తెగబడ్డ రష్యాతో ఇకపై దౌత్య సంబంధాలను నెరపేదిలేదని యుక్రెయిన్ తేల్చేసింది. ఈ మేరకు రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించారు. యుద్ధాన్ని నివారించేందుకు యుక్రెయిన్ మిత్రదేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించడానికి వెనకాడొద్దని కోరారు. అటు యుక్రెయిన్ పై రష్యా దాడితో పోలాండ్, జర్మనీ అప్రమత్తం అయ్యాయి. యుక్రెయిన్ కు సరిహద్దున ఉన్న పోలాండ్ పై దాడి చేస్తే పెద్దఎత్తున పోలాండ్ కు సైనిక సహకారం అందిస్తామని జర్మనీ ప్రకటించింది.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధం ప్రపంచ దేశాలను భయకంపితులను చేస్తోంది. మిలిటరీ ఆపరేషన్ పేరుతో యుక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే రష్యా చేస్తున్నది మిలిటరీ ఆపరేషన్ కాదని, యుద్ధానికే తెగబడుతోందని యుక్రెయిన్ వాదిస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షాన్ని కురిపించింది. తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా రష్యా ఫైటర్ జెట్లను కూల్చేశామని యుక్రెయిన్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పోరు అంతకంతకూ భీకర రూపం దాలుస్తోంది.