రష్యాలో ఉగ్రదాడి ఘటన.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య

Russia: రష్యా-యుక్రెయిన్‌ యుద్ధానికి, ఈ దాడికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా తెలిపింది.

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. 143 మంది చనిపోగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఐసిస్‌ ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. నలుగురు గన్‌మన్లతో పాటు మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఉగ్రదాడి జరగవచ్చని నెల రోజల క్రితమే అమెరికా హెచ్చరించింది. మరోవైపు ఉగ్రవాదులకు యుక్రెయిన్‌తో సంబంధాలు ఉన్నాయని.. రష్యా ఆరోపిస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భీకర ఉగ్రదాడితో యావత్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. ఉగ్రదాడిలో వంద మందికి పైగా మృతి చెందారు. 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని రష్యా అధికార వర్గాలు తెలిపాయి.

మాస్కో శివారులోని క్రోకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లో ఓ సంగీత కార్యక్రమం జరుగుతుండగా.. అక్కడికి సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. తుపాకుల మోత నడుమ.. ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్ర భయాందోళనతో జనం పరుగులు తీశారు.

దాడిని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా ఖండించారు. దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్‌ స్పష్టం చేశారు. ముష్కరులకు యుక్రెయిన్‌తో సంబంధాలు ఉన్నాయని.. దాడుల తర్వాత యుక్రెయిన్‌ వైపు వేళ్లే ప్రయత్నం చేశారని ఎఫ్ఎస్‌బీ ఆరోపించింది. మరోవైపు తమకు ఎలాంటి సంబంధం లేదని యుక్రెయిన్‌ స్పష్టం చేసింది.

ఆధారాలు లేవు: అమెరికా
రష్యా-యుక్రెయిన్‌ యుద్ధానికీ ఈ దాడికీ సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా తెలిపింది. మరోవైపు దాడి తమ పనే అని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. రష్యాలో ఉగ్రదాడి జరగవచ్చని అమెరికా ముందే హెచ్చరించినట్లు శ్వేతసౌధం తెలిపింది. నెల రోజుల ముందే తమకు సమాచారం వచ్చిందని వైట్‌హౌస్‌ వర్గాలు చెప్పాయి. ఈ విషయాన్ని వెంటనే రష్యాలో ఉన్న అమెరికన్లకు అడ్వైజరీ కూడా జారీ చేశామని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.

మరోవైపు ఉగ్రదాడిని ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also Read: మీ ఇంట్లోనూ ఇలాంటి స్పూన్ వాడుతున్నారా?

ట్రెండింగ్ వార్తలు