Trump Putin Meeting: మీ మీదే భారం.. ఇది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ట్రంప్ పై పెట్టిన నమ్మకం. యుద్ధం విరమించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి జాగ్రత్త. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఇచ్చిన వార్నింగ్. ఇలాంటి ఉత్కంఠ కలిగించే పరిణామాల మధ్య ఒక పెద్ద భేటీకి రంగం సిద్ధమైంది. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భేటీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కాసేపట్లో ఈ ఇద్దరు నేతలు చర్చలకు కూర్చోబోతున్నారు.
ఈ భేటీవైపే యావత్ ప్రపంచం చూస్తోందంటే అతి చేసి చెప్పడం కాదు. మూడున్నరేళ్ల క్రితం యుక్రెయిన్ పై ఏకపక్షంగా దాడికి దిగిన రష్యా.. అప్పటి నుంచి వార్ కంటిన్యూ చేస్తోంది. మరోవైపు ఈ చర్చల్లో కనుక యుద్ధ విరమణకు ఒప్పుకోకపోతే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయంటూ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు అటు భారత్ పై కూడా సెకండరీ టారిఫ్ లు ఉంటాయని అమెరికా వర్గాలు హెచ్చరించాయి.
రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం వల్లనే ఆ దేశం యుద్ధం కొనసాగిస్తోంది అన్నది అమెరికా చెప్పే లాజిక్. ఆ రకంగా ఈ చర్చలు మన దేశానికి కీలకంగా మారాయి. ఓ వైపు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా రష్యా, యుక్రెయిన్ వార్ కి ఎండ్ కార్డ్ పడాలని ఆశిస్తున్నాయి. అదే పనిగా యుక్రెయిన్ కు యుద్ధ సాయం చేయటం కూడా అటు అమెరికాకు ఇతర కూటమి దేశాలకు భారంగా మారింది.
ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి ఏంటన్నది కీలకంగా మారింది. ఈ క్రమంలోనే చర్చలకు ముందు సీజ్ ఫైర్ కు ట్రంప్ చాలా సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారని పుతిన్ కామెంట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి ప్రతిగా అన్నట్లుగా ట్రంప్ కూడా నాతో పుతిన్ సరిగానే వ్యవహరిస్తారు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఏం జరగనుంది? అనేది తీవ్ర ఆసక్తికరంగా మారడంతో పాటు ఉత్కంఠ రేపుతోంది.